Nagababu: విశాఖ కిడ్నీ మాఫియాపై నాగబాబు ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-04-29T12:17:06+05:30 IST

రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన విశాఖ కిడ్నీ మాఫియాపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు.

Nagababu: విశాఖ కిడ్నీ మాఫియాపై నాగబాబు ఏమన్నారంటే...

అమరావతి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన విశాఖ కిడ్నీ మాఫియాపై (Visakha Kidney Mafia జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు (Jana Sena State General Secretary Nagababu) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ కిడ్నీ మాఫియా ప్రధాన సూత్రధారులను బయటకు లాగాలన్నారు. గంజాయి, మద్యం మత్తుతో నిరుద్యోగ యువతను లొంగదీసుకుంటున్నారని అన్నారు. బైక్ ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస జీవనాధారం లేని నిరుద్యోగ యువతను, నిరుపేద కుటుంబాలను విశాఖ కిడ్నీ మాఫియా పావులుగా వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు విశాఖ కిడ్నీ రాకేట్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి తిరుమల ఆసుపత్రి ఎండీ పరమేశ్వరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పరారీలో ఉన్న డాక్టర్ స్రవంత్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే కామరాజు పోలీసుల ఎదుట లొంగిపోగా.. ఎలినా పరారీలో ఉన్నారు. ఎలినా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే బాధితుడు వినయ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా.. విశాఖలో కిడ్నీల వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఆర్థిక అవసరాలున్న వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఆస్పత్రులు కిడ్నీల దందా సాగిస్తున్నాయి. నగర పరిధిలోని పలు ఆస్పత్రులు.. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు అనధికారికంగా కిడ్నీ ఏర్పాటు చేస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకొస్తుండగా, ఆయా ఆస్పత్రులు నిరుపేదలకు కొంత మొత్తాన్ని చెల్లించి వారి నుంచి కిడ్నీలు తీసుకుని అవసరమైన వారికి అమరుస్తున్నాయి. అయితే, ఆర్థిక లావాదేవీలు బెడిసికొడుతుండడంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నగర పరిధిలోని శ్రద్ధ ఆస్పత్రిపై ఆరోపణలు రాగా, తాజాగా పెందుర్తిలోని శ్రీతిరుమల ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌ బయటపడింది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తికి ముందస్తు ఒప్పందం ప్రకారం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2023-04-29T12:17:06+05:30 IST