మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంతో... 130 మొబైల్ ఫోన్లు రికవరీ : ఎస్పీ
ABN , First Publish Date - 2023-01-21T00:05:56+05:30 IST
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (వాట్సప్ నెం.9392941541) ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 130 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ టెక్నికల్ విభాగం రికవరీ చేసిందని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడి, ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణకుమార్, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కడప(క్రైం), జనవరి 20: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (వాట్సప్ నెం.9392941541) ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 130 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ టెక్నికల్ విభాగం రికవరీ చేసిందని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ తన కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడి, ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణకుమార్, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా, ఎఫ్‌ఐఆర్ నమోదు లేకుండా ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అందజేయాలనే సంకల్పంతో గత ఏడాది డిసెంబరు 1న ఎంఎంటీఎస్ (మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం) ఉచిత వెబ్‌సైట్ సేవలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 1,682 మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు రాగా ఎంఎంటీఎస్ ద్వారా 409 యాక్టివ్ మొబైల్స్ గుర్తించా మని, ప్రస్తుతం దాదాపు 30 లక్షల విలువైన 130 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. ప్రజలకు మరింత సులువైన సేవలు అందించడానికి 9392941541 ద్వారా చాట్ బాక్స్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. సరైన బిల్లులు లేకుండా ఎవరూ మొబైల్స్ కొనవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం మొబైల్ ఫోన్ల రికవరీలో శ్రమించిన ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు, సైబర్ క్రైం టెక్నికల్ విభాగం ఇన్‌స్పెక్టరు వి.శ్రీధర్‌నాయుడు, ఆర్‌ఎ్‌సఐ శ్రీనివాసులు బృందాన్ని అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. కేవలం నెలరోజుల్లోపే ఫోన్లు రికవరీ చేసి తమకు అందించడంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
పెండింగు కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
పెండింగు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని పెన్నార్ పోలీసు కాన్ఫరెన్స్ హాలులో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అతి తీవ్రమైన నేరాల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చార్ ్జషీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేస్తూ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలపై నేరాలు, రాబరీ, డెకాయిట్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాలపై నిర్ణీత సమయంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. మహళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు నిఘా పెంచాలన్నారు. మట్కా, క్రికెట్, బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.