Kotamreddy : కోటంరెడ్డి బ్రదర్స్‌తో సుధీర్ఘ చర్చ తర్వాత బాలినేని ఏమన్నారంటే... జగన్ ఏం చేయబోతున్నారు..?
ABN, First Publish Date - 2023-01-31T21:21:50+05:30
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వ్యవహారం గంటకో...
నెల్లూరు/అమరావతి : నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నిన్న, మొన్న అధిష్టానంపై అసంతృప్తి, ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం బయటికి రాగా.. తాజాగా ఫోన్ కాల్ ఆడియోనే బయటికి వచ్చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఈ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav), వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో (Vemireddy Prabhakar Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి (Balineni Sreenivasulu Reddy) భేటీ అయ్యారు. అనంతరం కోటంరెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యి సుధీర్ఘ చర్చలు జరిపారు నేతలు.
అవును.. నిజమే..!
ఈ కీలక చర్చల అనంతరం ఈ ఎపిసోడ్‌పై బాలినేని (Balineni) స్పందించారు. అవును.. కోటంరెడ్డి బ్రదర్స్ (Kotamreddy Brothers) చంద్రబాబుతో (Chandrababu)మాట్లాడుకున్నారని తేల్చిచెప్పేశారు బాలినేని. వైసీపీని (YSR Congress) వీడి వెళ్లాలనుకున్నప్పుడు వెళ్లిపోవచ్చని కూడా చెప్పారాయన. టీడీపీలోకి పోయేవాళ్లు పోకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. అసలు ఫోన్ ట్యాంపింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే ఇవ్వండని బాలినేని ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తనను కలిశారని.. ఈ విషయంపై వారం సమయం కోరారన్నారు బాలినేని. కోటంరెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టామనడం సరికాదన్నారు. సీఎం జగన్‌తో (CM YS Jagan) మాట్లాడి త్వరలో రూరల్ ఇన్‌చార్జ్‌ని నియమిస్తామని కూడా చెప్పేశారు బాలినేని.
మౌనానికి అర్థమేంటో..!
వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డితో కోటంరెడ్డి సుమారు గంటపాటు చర్చ జరిగింది. గత కొన్నిరోజులుగా నెలకొన్న సమస్యలపై సీఎంతో చర్చిస్తానని శ్రీధర్‌కు వేమిరెడ్డి మాటిచ్చారు. అయితే ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడటానికి, ముఖం చూపించకుండానే మౌనంగా వేమిరెడ్డి ఆఫీసు నుంచి వెళ్లిపోయారు కోటంరెడ్డి. అంటే మౌనానికి అర్థమేంటో కోటంరెడ్డికే తెలియాలి మరి.
జగన్ లేకుండానే..!
మరోవైపు.. కోటంరెడ్డి ఆఫీస్ దగ్గర కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల్లో ఎక్కడా సీఎం జగన్, వైసీపీ నేతల (YSRCP Leaders) ఫొటోలు మాత్రం కనిపించట్లేదు. ‘జయహో కోటంరెడ్డి బ్రదర్స్’ అంటూ ఫ్లెక్సీలు (Flexies) వెలిశాయి. ‘మీరు ఏ పార్టీలో ఉన్నా.. మీవెంటే మేము’ అంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. దీంతో మరోసారి కోటంరెడ్డి వ్యవహారం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఏం తేలుతుందో..!
గత కొన్నిరోజులుగా నెల్లూరు రూరల్‌లో జరిగిన పరిణామాలు, కోటంరెడ్డితో బాలినేని భేటీ.. ఈ మొత్తం వ్యవహారంపై బుధవారం నాడు జగన్ దగ్గర పంచాయితీ జరగనుంది. సమావేశం తర్వాతే నియోజకవర్గ సమన్వయకర్త పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఫైనల్‌గా నెల్లూరు పెద్దారెడ్ల పంచాయితీలో జగన్ ఏం తేలుస్తారు..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. నెల్లూరు రూరల్ నియోజకర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంలో అధిష్టానం క్లారిటీగా ఉందని టాక్ నడుస్తోంది. నెల్లూరు వైసీపీలో కీలకంగా ఉన్న ఆనం విజయకుమార్‌రెడ్డికి (Anam Vijayakumar reddy) రూరల్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరి బుధవారం నాడు ఈ మొత్తం ఎపిసోడ్‌కు జగన్ ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో వేచి చూడాల్సిందే.
Updated Date - 2023-03-25T18:26:54+05:30 IST