TDP: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై పయ్యావుల సవాల్
ABN, First Publish Date - 2023-03-08T19:19:22+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (Skill Development Scam)పై టీడీపీ (TDP) సీనియర్ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సవాల్ విసిరారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (Skill Development Scam)పై టీడీపీ (TDP) సీనియర్ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సవాల్ విసిరారు. టీడీపీ చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్‌మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా..? అంటూ ఛాలెంజ్ చేశారు. నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్ చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదంటూ కేశవ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారని చెప్పారు. సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం.. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్లను మీడియాకు పయ్యావుల విడుదల చేశారు.
పిల్లల భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. సీమెన్స్ సంస్థతో ఒప్పందం పేరుతో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి నిధులు మళ్లించారనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏయే ఖాతాలకు నిధులు వెళ్లాయో.. ఆ వివరాలు వెల్లడించాలని, ఖాతాల నెంబర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీమెన్స్ సంస్థకు నిధులు విడుదల చేస్తూ ప్రేమ్ చంద్రారెడ్డి సంతకం చేశారని చెప్పారు. ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు..?, ప్రేమ్ చంద్రారెడ్డి ఏమైనా నాటి సీఎం చంద్రబాబు చెబితే సంతకం చేశానని చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రేమ్ చంద్రారెడ్డి కూడా ఆషామాషీగా నిధులు విడుదల చేయలేదన్నారు. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ చేయించి.. సర్టిఫికేషన్ చేయించిన తర్వాతే నిధులు విడుదల చేశారని చెప్పారు. సాఫ్ట్ వేర్ వాల్యూయేషన్ చేసింది కేంద్ర రంగ సంస్థేనని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ చేయించిన విషయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? అని పయ్యావుల ప్రశ్నించారు. సీమెన్స్ వ్యవహరంపై అర్జా శ్రీకాంత్‌ను ప్రభుత్వం నివేదిక అడిగిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లల్లో అధ్యయనం చేసి వచ్చి.. అంతా బాగుందని అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారని చెప్పారు. అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదన్నారు. ఇప్పుడు మరోసారి అర్జా శ్రీకాంత్‌ను విచారణ పేరుతో పిలిచి కొట్టి తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కట్టు కథలు మళ్లీ మొదలు పెట్టారని కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో పెద్ద స్కామ్ జరిగినట్టు చెప్పుకొస్తున్నారని, గత నాలుగేళ్లుగా చెప్పిన కథలే మళ్లీ చెబుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంతో సీమెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, దాన్ని అధ్యయనం చేసి ఏపీ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. గుజరాత్ సహా ఆరు రాష్ట్రాల్లో సీమెన్స్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. అలాగే సీమెన్స్ సంస్థపై జీఎస్టీ విషయంలో ఆరోపణలు వచ్చాయన్నారు. 170కు పైగా దేశాల్లో సీమెన్స్ సంస్థ కార్యాకలాపాలు ఉన్నాయన్నారు. సీమెన్స్ సంస్థ చంద్రబాబు బినామీ సంస్థ అన్నట్టు ప్రచారం చేశారని చెప్పారు. పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని సీమెన్స్ సంస్థ భరించాలని పయ్యావుల సూచించారు. ఒప్పందాన్ని సరిగ్గా చదువుకుని విమర్శలు చేస్తే మంచిదన్నారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ తరగతులు పర్యవేక్షణ చేపట్టాల్సిన బాధ్యత సీమెన్స్‌దేనన్నారు. సీమెన్స్ సంస్థకు చెందిన సుమన్ బోస్, డిజైన్ టెక్ సంస్థకు వికాస్ మధ్య లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. దానికీ టీడీపీకి ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై గతంలో మేం ఆధారాలతో ఆరోపణలు చేశామన్నారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే కోర్టులకు వెళ్తామన్నారు. ఘంటా సుబ్బారావు జవహర్ నాలెడ్జ్ సెంటర్ల కోసం ఐదేళ్లు పని చేశారని గుర్తుచేశారు.
Updated Date - 2023-03-08T19:19:24+05:30 IST