Ramakrishna: ఈ జగన్‌కు ఏం పోయేకాలం వచ్చిందో...
ABN, First Publish Date - 2023-02-09T14:20:08+05:30
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
విజయవాడ: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో సీఎంలు ఎవరూ ఈ ఎన్నికలలో జోక్యం చేసుకునే వారు కాదని... ఈ జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)కి ఏం పోయే కాలం వచ్చిందో అంటూ వ్యాఖ్యలు చేశారు. అన్నీ తనకే కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రతాప్ రెడ్టిని కడప ఆర్జేడిగా నియమించారన్నారు. ఇక్కడ పని చేయాల్సిన వ్యక్తిని అక్కడ ఎలా నియమించారని ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డి ఎన్నికల సమావేశాలు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చుతున్నారని ఆరోపించారు. రామచంద్ర రెడ్డి స్కూల్‌లో 12 మంది ఉంటే 57 మందికి ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మటన్ కొట్టే వాళ్లకు కూడా ఓట్లు ఉన్నాయన్నారు. ఇప్పటికే గిఫ్ట్‌లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. ‘‘ఈ ఎన్నికలు అయినా స్వేచ్చగా జరిగేలా చూడు... జగన్. నీకు ఎలాగూ ఓటమి భయం ఉంది... దీనికి ఎన్నికలు ఎందుకు. అన్నీ ఏకపక్షంగా నియమించుక... సరిపోతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అసలు సంబంధం లేని ప్రతాప్ రెడ్డిని పంపడం వెనుకే జగన్ (AP CM)భయం అర్ధం అవుతోందన్నారు. ఈ ఎన్నిక గెలిపిస్తే హిందూపురం ఎంపీ సీటు ఇస్తామని ప్రతాప్ రెడ్డికి హామీ ఇచ్చారంట. అక్కడ బట్టలు విప్పదీసుకునే ఎంపీకి ఈసారి సీటు లేదంట అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలలో కూడా ఇంత దారుణంగా చేయడానికి జగన్‌కు సిగ్గుండాలని అన్నారు. ఇప్పటికే ప్రజా స్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారన్నారు. అన్ని ఆధారాలు పరిశీలించి ప్రతాప రెడ్డిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇలాంటి సీఎం రాష్ట్రానికి అవసరమా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఏపీ సీఎం జగన్ (Jagan Reddy)పై రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ (Adani)కి సంబంధించిన అంశంపై మోడీ నోరు విప్పరన్నారు. అక్రమాలు ప్రశ్నిస్తే దేశంపై దాడిగా అభివర్ణిస్తారా అని ప్రశ్నించారు. దేశానికి అన్యాయం చేసే వారికి మోడీ (Prime Minister) కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లల్లో పది లక్షల కోట్లు ఎలా చేరాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులపై విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయరన్నారు. ఏపీ (Andhrapradesh)లో ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఉన్నారని... అదానీకి ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. నిన్న దేశ వ్యాప్తంగా అదానీపై చర్చ జరిగినా... జగన్ భూములు కేటాయించారన్నారు. అదానీకి ఊడిగం చేయడానికే ఏపీలో జగన్ బ్రోకర్ పని చేశారని విరుచుకుపడ్డారు. ఇలాంటి బ్రోకర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని ప్రశ్నించారు. రేపు వామపక్ష పార్టీలు కేంద్ర కార్యాలయాల వద్ద ఆందోళన చేపడుతున్నట్లు రామకృష్ణ ప్రకటించారు.
Updated Date - 2023-02-09T14:20:09+05:30 IST