కష్టాల ‘కృష్ణా..!’
ABN , First Publish Date - 2023-02-12T00:41:19+05:30 IST
కృష్ణా యూనివర్సిటీకి చెందిన విద్యార్థినుల విద్యుత్ షాక్ దుర్ఘటన వర్సిటీలోని అనేక సమస్యలను వేలెత్తి చూపిస్తోంది. పేరుకు పెద్ద యూనివర్సిటీ అయినా, 1,500 మంది విద్యార్థులు చదువుతున్నా కనీసం హాస్టల్ భవనాన్ని సమకూర్చుకోలేని దుస్థితి ఇక్కడ ఉంది. చాలామంది అద్దె ఇళ్లలో ఉంటూ చదువుకుంటున్నా రాకపోకలకు సరిపడా బస్సులను కూడా సమకూర్చలేని నిర్లక్ష్య వైఖరితో అధికారులు ఉంటున్నారు. హాస్టల్ భవనాల నిర్మాణానికి రెండేళ్ల కిందటే పునాదులు పడినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడింది లేదు. విద్యార్థులకు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా రిజిస్ట్రార్, వీసీ అందుబాటులో లేకపోవడం వర్సిటీలో భద్రతను, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.

రెండేళ్లుగా అక్కరకు రాని హాస్టల్ భవనాలు
పునాదులు వేసి మరిచిన అధికారులు
అద్దె ఇళ్లలోనే ఉంటున్న విద్యార్థులు
సరిపడా బస్సులు కూడా లేక అవస్థలు
అందుబాటులో ఉండని రిజిస్ట్రార్, వీసీ
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ 2008 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. పీజీకి సంబంధించి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంకామ్ కోర్సులున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. ఇక్కడ 1,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు పదిహేనేళ్ల కిందట ప్రారంభించిన ఈ వర్సిటీకి ఇంతవరకు బాలుర, బాలికల వసతి గృహాలు సమకూరలేదు. వీసీలుగా ఎవరొచ్చినా ఇదిగో హాస్టల్ భవనాలు నిర్మిస్తామని చెప్పడమే తప్ప పునాదుల దశను దాటలేదు. విద్యార్థులకు అవసరమైన హాస్టల్ భవనాల నిర్మాణం ప్రారంభించి రెండేళ్లు గడిచినా పునాదులకే పరిమితమయ్యాయి. ఫలితంగా వివిధ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు.
అద్దె గదులే దిక్కు
యూనివర్సిటీలో 1,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ హాస్టల్ భవనాలు లేక పోవడంతో వీరంతా మచిలీపట్నంలోని అద్దె గదుల్లోనే ఉంటున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్లో కొంతమంది హిందూ కళాశాలలోని హాస్టల్ భవనంలో ఉంటున్నారు. పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్ అందుబాటులో లేకపోవడంతో అద్దెకు ఉంటున్నారు. వీరంతా 5 కిలోమీటర్ల దూరంలోని యూనివర్సిటీకి రోజూ వచ్చి వెళ్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ భవనాలు ఉంటే విద్యార్థులు అక్కడే ఉండేవారని, విద్యుదాఘాతానికి గురయ్యేవారు కాదని అధ్యాపకులు చెబుతున్నారు. ఇక్కడ 1,500 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 4 బస్సులే ఏర్పాటు చేశారని, ఈ బస్సులు ఎటూ చాలడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా హాస్టల్ భవనాలు, బస్సులు సరిపడినన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా వీసీ, రిజిస్ర్టార్ పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు.
రిజిస్ర్టార్ ఎక్కడ..?
కృష్ణా యూనివర్సిటీ రిజిస్ర్టార్ స్థానికంగా నివాసం ఉండాలి. కానీ, ఆయన రోజూ గుంటూరు జిల్లా నుంచి వచ్చి వెళ్తున్నారు. ఇద్దరు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయస్థితిలోకి వెళ్లినా యూనివర్సిటీ రిజిస్ర్టార్ మచిలీపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి రాలేదు. వీసీ కూడా అందుబాటులో లేరు. తీవ్రగాయాలపాలైన విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించాలని, అంబులెన్సులను ఏర్పాటు చేయాలని తోటి విద్యార్థులే వైద్యులను, సిబ్బందిని బతిమాలుకుంటూ కనిపించారు. అయినా రిజిస్ర్టార్, వీసీలు మచిలీపట్నంలోని ఆసుపత్రికి రాలేదు. విద్యార్థులు, ఒకరిద్దరు ప్రొఫెసర్లు ఆసుపత్రికి వచ్చారు. సెలవు రోజున ఈ సంఘటన జరిగినప్పటికీ రిజిస్ర్టార్ లేదా క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్, రెక్టార్, వీసీ అందుబాటులో లేకపోవడాన్ని విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఖండిస్తున్నారు.