Pattabhi: గన్నవరం కోర్టుకు పట్టాభి మెడికల్ రిపోర్టు... జడ్జి నిర్ణయం ఇదే..
ABN, First Publish Date - 2023-02-22T12:04:40+05:30
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.
కృష్ణా: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP spokesperson Kommareddy Pattabhiram) ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు (Gannavaram Subjail)కు తరలించారు. పట్టాభి (TDP Leader)పై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈరోజు ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్ కోర్టు జడ్జి ఎదుట పట్టాభి (Kommareddy Pattabhi)ని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్ రిపోర్టును జడ్జికి సమర్పించారు. ఈ క్రమంలో పట్టాభితో మరో 13మందికి జడ్జి రిమాండ్ విధించారు.
అయితే నిన్న పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా... తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ (Third degree) ప్రయోగించారని.. కాళ్లు, చేతులపై కోట్టారని న్యాయమూర్తికి పట్టాభి విన్నవించారు. దీంతో పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెడికల్ రిపోర్టును అందించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి మొత్తం పట్టాభిని గన్నవరం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు.. మిగిలిన 13మందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం పట్టాభిని పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (Vijayawada Government Hospital) కి తరలించారు. అక్కడి వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఆయనను గన్నవరం కోర్టు (Gannavaram Court)కు తీసుకువచ్చారు.
మెడికల్ రిపోర్ట్ ఇదే...
పట్టాభి మెడికల్ రిపోర్టును విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సీల్డ్ కవర్‌లో న్యాయమూర్తికి అందజేశారు. పట్టాభి శరీరంపై తీవ్ర గాయాలేమీ లేవని, కేవలం చేతిపై వాపు మాత్రమే ఉందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా పట్టాభికి రిమాండ్ విధిస్తూ.. గన్నవరం సబ్‌జైలుకు తరలించాలని సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
ఉద్రిక్త పరిస్థితులు...
కాగా.. రెండు రోజుల క్రితం గన్నవరం (Gannavaram)లో టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కార్యాలయంపై దాడి చేయడంతో పాటు పలు కార్లను ధ్వంసం చేశారు. అయితే దాడి చేసిన వారిపై మొక్కుబడిగా సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు.. బాధితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం నుంచి గన్నవరం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులను ఎవరిని కూడా బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్‌లు చేయడంతో పాటు వచ్చిన వారిని బలవంతంగా పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు.
Updated Date - 2023-02-22T12:48:06+05:30 IST