షాతో పవన్ భేటీ
ABN , First Publish Date - 2023-07-20T03:23:24+05:30 IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారమిక్కడ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

పొత్తులపై 25 నిమిషాలు మంతనాలు.. రాష్ట్రాభివృద్ధి ప్రణాళికపై చర్చలు
బీజేపీ ఇన్‌చార్జి మురళీధరన్‌తోనూ అల్పాహార సమావేశం
ఢిల్లీలో జనసేనాని వరుస భేటీలు
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారమిక్కడ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయన నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో షాను కలుసుకున్నారు. ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జగన్ వ్యవహారంపై మంతనాలు సాగించినట్లు తెలిసింది. మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొత్తులు, జగన్ ప్రభుత్వం తీరుపై అమిత్ షాతో ఆయన చర్చించినట్లు సమాచారం. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్ ఆ తర్వాత ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌ను కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అభిపాయ్రాలను పంచుకున్నామని షా ట్విటర్‌లో తెలిపారు. బుధవారం ఉదయం పవన్.. బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్ ట్వీట్ చేశారు.
పొత్తులు ఉంటాయి..: రఘురామ
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు 100శాతం ఉంటుందని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. బుధవారం ఆయన పవన్ కల్యాణ్‌తో మంతనాలు జరిపారు. చర్చల అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు చ్చితంగా ఉంటుందన్న విశ్వాసం తనకు కలిగిందన్నారు. భీమవరం నుంచి పోటీ చేయాలని తాను కోరగా.. జనసేనాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. మురళీధరన్‌తో పవన్ నిరంతరం టచ్‌లో ఉన్నారన్నారు.
పవన్ వైఖరి సిగ్గుచేటు
ఆయన ఎన్డీఏలో చేరడం ఆత్మహత్యా సదృశమే: సీపీఎం
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ‘‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడతానని రంకెలు వేశారు. ఇప్పుడేమో ఏకంగా ఎన్‌డీఏ గూటికి చేరి బీజేపీ రోడ్‌మ్యా ప్‌ను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది సిగ్గుచేటు’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పవన్ ఎన్డీఏ కూటమిలో చేరడం ఆత్మహత్యా సదృశమే. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెడుతున్నాయి. దేశమంతా బీజేపీని ఓడించడానికి ఏకమవుతుండగా... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ సరసన చేరి జనసైనికులు, వీరమహిళలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు.