Somuveerraju: కలకలం రేపుతున్న పోస్టర్.. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలి
ABN, First Publish Date - 2023-02-19T10:13:21+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somuveerraju) విమర్శలు గుప్పించారు. సీఎం జగన్.. బాల శివుడికి పాలు పట్టిస్తున్న పోస్టర్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెంటనే తొలగించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ట్విట్టర్‌లో హేళన చేస్తున్నట్లుగా చిత్రాన్ని ప్రదర్శించడంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ రోజు 12 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు సోమువీర్రాజు తెలిపారు. వైసీపీ పార్టీ హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల రాజకీయంలో బీజేపీ రూటే వేరు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రంలో తమ రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీని వాడుకోవడం మొదలుపెట్టిన బీజేపీ ఇప్పుడు వచ్చే ఎన్నికల దృష్టితో కొత్త రాజకీయాలకు తెరదీస్తోంది. ఓవైపు వైసీపీతో స్నేహంగా నటిస్తూనే మరోవైపు ఆ పార్టీని ఇరుకునపెట్టే వ్యూహాలు రచిస్తోంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇదంతా చూస్తున్న వైసీపీ అధినేత మాత్రం మౌనంగా ఉంటున్నారు.
ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య స్నేహం ఉందా అంటే లేదంటారు, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సన్నిహిత సంబంధాలు మాత్రం ఉన్నాయంటారు. అలాగని ఏపీ కోసం వైసీపీ చేస్తున్న డిమాండ్లలో ఒక్కటైనా నెరవేరుస్తున్నారా అంటే అదీ లేదు. ఇంకా చెప్పాలంటే గతంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీల ప్రకారం చేయాల్సిన పనుల్లో ఒక్కదాన్నైనా చేయడం పక్కనబెడితే కనీసం ప్రస్తావించకుండానే విశాఖ నుంచి ప్రధాని తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైసీపీ విషయంలో ఎలా ఉండాలనే దానిపై మిత్రపక్ష నేత పవన్ కళ్యాణ్ కు మాత్రం బీజేపీ దిశానిర్దేశం చేస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా వైసీపీని భవిష్యత్తులో చికాకుపెట్టే పనుల్ని ఇప్పటి నుంచే రెడీ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
తంజావూరులో ‘వాకింగ్ విత్ శారీ’ పోటీలు
*****************
నారా లోకేష్ హైదరాబాదుకు ప్రయాణం
***************
Updated Date - 2023-02-19T10:16:29+05:30 IST