శ్రీకాకుళం జిల్లాలో స్ఫూర్తివంతమైన ఘటన

ABN , First Publish Date - 2023-04-23T21:05:04+05:30 IST

ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో గారబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. అయితే, విధి వక్రీకరించడంతో ఆ బిడ్డ బ్రెయిడ్‌ డెడ్‌ (Braid dead)తో మృతిచెందాడు.

శ్రీకాకుళం జిల్లాలో స్ఫూర్తివంతమైన ఘటన

సోంపేట: ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. అయితే, విధి వక్రీకరించడంతో ఆ బిడ్డ బ్రెయిడ్‌ డెడ్‌ (Braid dead)తో మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అంతటి దుఃఖంలో కూడా ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేసి మరో ఐదుగురికి ప్రాణ భిక్ష పెట్టారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లోనే తొలిసారి చోటుచేసుకున్న ఈ ఘటన ఎందరికో స్ఫూర్తినిచ్చింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి మోహన్‌, గిరిజాకల్యాణిల కుమారుడు కిరణ్‌ చంద్‌ (15) పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలు (10th Class Exams) రాస్తుండగా కాస్త అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని స్థానిక ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం కిరణ్‌ చంద్‌ (Kiran Chand) పరీక్షలు రాశాడు. అయితే, ఈ నెల 15న చివరి పరీక్ష రాసిన వెంటనే మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో వెంటనే విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ కిరణ్‌ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం వైద్యుల సలహాతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేశాడు. వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ, చివరికి కిరణ్‌ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం కిరణ్‌చంద్‌ మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. ఆ దుఃఖాన్ని దిగమింగుకుని కుమారుడి అవయవ దానానానికి అంగీకరించారు. ఈ సందర్భంగా కిరణ్‌చంద్‌ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, జెమ్స్‌ యాజమాన్యం, సిబ్బంది నివాళులర్పించారు.

అవయవదానంపై ఆర్గాన్‌ డొనేషన్‌ సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రులు అంగీకరించడంతో గుండె, కళ్లు, కిడ్నీలు దానం చేశారు. అవయవాలను ఇతర ప్రాంతాలకు చేర వేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం కిరణ్‌చంద్‌ నుంచి సేకరించిన ఒక కిడ్నీని విశాఖపట్నం అపోలో ఆసుపత్రికి, మరోక కిడ్నీ, లివర్‌ను విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రికి, గుండెను తిరుపతికి, కళ్లను విజయనగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీకి పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడు చనిపోయినా.. మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్‌కు.. అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా విద్యార్థి గుండెను తిరుపతికి తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని టీటీడీ చిన్నారుల ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారికి గుండె మార్పిడి చికిత్స చేసి బతికించారు.

Updated Date - 2023-04-23T21:08:26+05:30 IST