పోరుబాటలో ముందుకే!

ABN , First Publish Date - 2023-10-04T03:28:02+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె స్ట్‌ను నిరసిస్తూ పార్టీ శ్రేణుల ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

పోరుబాటలో ముందుకే!

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న రిలే దీక్షలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరె స్ట్‌ను నిరసిస్తూ పార్టీ శ్రేణుల ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి. 21వ రోజైన మంగళవారం రిలే దీక్షలు, జలదీక్షలు, ఆలయాలకు పాదయాత్రలు, నల్ల బెలూన్లు, దుస్తులతో నిరసన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించగా, తిరుపతిలో టీడీపీతో కలిసి సీపీఐ, జనసే నాయకులు ర్యాలీ జరిపారు. ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌, టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధికారి ప్రతినిధి పొట్లూరి దర్శిత్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడ పశ్చిమలో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా ఆధ్వర్యంలో కామధేను అమ్మవారి ఆలయం వద్ద 101 కొబ్బరికాయలను కొట్టారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గా వద్ద మైలవరం ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేశాయి. నరసాపురంలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. ప్రార్థనలు చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌ నుంచి నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం వరకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో ముస్లిం లు శాంతి ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విజయనగరం కోట జంక్షన్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై కూలీలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్యచౌదరి చేపట్టిన నిరవధిక దీక్ష రెండోరోజు కొనసాగింది. కర్నూలు జిల్లా పాణ్యంలో నేతలు ఒంటికాలిపై నిరసన తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పార్వతీపురం షిర్డీసాయి మందిరంలో 108 కొబ్బరి కాయలు కొట్టారు. విజయనగరం నుంచి విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానానికి తెలుగు యువత నాయకులు పాదయాత్ర చేపట్టారు. గంటా రవి ఆధ్వర్యంలో 15మంది కాలినడకన ఆలయానికి వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నల్ల దుస్తులు ధరించి నిరాహార దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు నల్లదుస్తులతోనే ఉంటామని ప్రకటించారు.

శ్రీకాకుళంలో భారీ ర్యాలీ.. ఉద్రిక్తం

శ్రీకాకుళంలో టీడీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకులు సిద్ధంజిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మాజీమంత్రి కిమిడి కళావెంకటరావును, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని చేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను శ్రీకాకుళంలో అరెస్ట్‌ చేశారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు శ్రీకాకుళం చేరుకోగా.. పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో పోలీసు జీపులను అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని చేధించుకుని.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భారీసంఖ్యలో కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. వేలసంఖ్యలో కార్యకర్తలు నిరసన తెలపడంతో పోలీసుల వ్యూహం ఫలించలేదు.

తిరుపతిలో మహా ర్యాలీ

చంద్రబాబుకు సంఘీభావంగా తిరుపతిలో విపక్షాలు కదం తొక్కాయి. టీడీపీ నాయకులతో కలిసి జనసేన, సీపీఐ నేతలు ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి నాలుక్కాళ్ల మండపం వరకు మహా ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టుతో మరో నలుగురు మృతి

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వాయిదాతో మంగళవారం మరో నలుగురు గుండెపోటుతో మృతిచెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన టైలర్‌ అనసూరి రాజారావు (66), కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కె.మస్తాన్‌(38), కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన నాగార్జున గౌడ్‌(65), చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన వరిగపల్లి గోవిందయ్య(65) కుప్పకూలారు.

Updated Date - 2023-10-04T03:33:13+05:30 IST