Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
ABN , First Publish Date - 2023-05-27T21:19:48+05:30 IST
మహానాడులో 14వ సారి టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజమండ్రి: మహానాడులో 14వ సారి టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ప్రమాణం చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబును అభినందించారు. చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. కమిటీల ఏర్పాటుకు చంద్రబాబుకే సర్వాధికారాలు ఇచ్చారు. జాతీయ పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబుతో ఎన్నికల కమిటీ కన్వీనర్ కాల్వ శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. ఈ రోజు చారిత్రిక మహానాడులో జాతీయ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించామని, ఉదయం నుంచి మొత్తం 11 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. అన్ని నామినేషన్లు కూడా చంద్రబాబునాయుడును అధ్యక్షుడిగా బలపరుస్తూ దాఖలు అయ్యాయని, దీంతో నారా చంద్రబాబునాయుడును 14వ సారి పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశామని కాల్వ శ్రీనివాస్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. మహానాడు వేదికపై ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుజాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డానని చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 4 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని, పోలవరం ప్రాజెక్ట్, అమరావతిని ఆపేశారని చంద్రబాబు విమర్శించారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలోనే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, అనుభవం లేని వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏటా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోందని, పేదలు మరింత పేదలవుతున్నారని, విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణకు వలస వెళ్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్‌బీ, ట్రిపుల్‌ఐటీ, నల్సార్, ఉర్దూ వర్సిటీలు తానే తెచ్చానని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం గిరిజన వర్సిటీని తేలేకపోయిందని, జగన్ విధ్వంస పాలనతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిందని చంద్రబాబు విమర్శించారు.
2019లో AP రెవెన్యూ రూ.66,786 కోట్లు ఉండగా,.. తెలంగాణ రెవెన్యూ రూ.69,620 కోట్లు ఉందన్నారు. 2022-23లో ఏపీ రెవెన్యూ రూ.94,916 కోట్లు,.. తెలంగాణ ఆదాయం రూ. 1,32,175 కోట్లు ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీ కంటే తెలంగాణకు దాదాపు 40 శాతం ఆదాయం అధికమని, నాడు అక్కడ చేసిన అభివృద్ధి వల్లే నేడు తెలంగాణకు భారీ ఆదాయం వచ్చిందన్నారు. జనాభా దామాషా లెక్కన అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు.