Vinukonda: వినుకొండలో కష్టాలు
ABN , First Publish Date - 2023-01-30T03:10:38+05:30 IST
సీఎం జగన్ జిల్లా పర్యటనలకు వస్తున్నారంటే చాలు... అధికారుల అతి మామూలుగా ఉండటం లేదు.
నేడు సీఎం జగన్ పర్యటన
డివైడర్లపై ఉన్న పచ్చని చెట్లపైనా వేటు
రోడ్ల వెడల్పుతో నీటి పైపులైన్లు ధ్వంసం
బారికేడ్లు దాటి బయటకు రాలేక ఇక్కట్లు
వినుకొండ/నరసరావుపేట, జనవరి 29: సీఎం జగన్ జిల్లా పర్యటనలకు వస్తున్నారంటే చాలు... అధికారుల అతి మామూలుగా ఉండటం లేదు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, పరదాలు కట్టడం, దుకాణాలు మూసివేయించడం మామూలుగా మారింది. ఇప్పుడు కొత్తగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చటి చెట్లను కూడా నరికేస్తున్నారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో జరగనున్న బహిరంగ సభకు జగన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న పెద్దపెద్ద చెట్లను, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి నాగార్జున కాంప్లెక్స్ వరకు డివైడర్‌పై ఉన్న చెట్లను మొదళ్ల వరకూ నరికివేశారు. అవి బయటకు కనిపించకుండా ఆర్టీసీ బస్టాండ్ నుంచి శివయ్యస్థూపం వరకు భారీ వైసీపీ జెండాలను ఏర్పాటు చేశారు. ఐదు దశాబ్దాల నుంచి ప్రయాణికులకు, వాహనదారులకు నీడనిచ్చే వృక్షాలను సైతం ఆదివారం తొలగించారు. ఆ ప్రాంతంలోని చిరువ్యాపారులతో పాటు ప్రయాణికులు ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.
రక్షణ చర్యల్లో భాగంగా ఇక్కడి గ్రౌండ్ చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లను సైతం యంత్రాల సాయంతో నిలువునా నరికివేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నేమ్ బోర్డును మున్సిపల్ చెత్త ట్రాక్టర్లలో తొలగించారు. వెల్లటూరు సర్కిల్ నుంచి సీఎం సభావేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. వెల్లటూరు రోడ్డులో సభావేదిక వరకు రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా ఇళ్లల్లో తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న మున్సిపాలిటీ పైపులు విరిగిపోవడంతో మంచినీరు రాక ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండురోజులకు ఒకసారి వచ్చే నీటిని పట్టుకోలేక, ఇళ్ల ముందు అమర్చిన బారికేడ్ల నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ పైపులైన్ విరిగిపోవడంతో నీరంతా రోడ్డుపై వరదలా పారింది. కాగా, వినుకొండలో సోమవారం జరగనున్న సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు బస్సులు పంపాలని ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. బస్సులు పంపకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఏజెంట్లు హెచ్చరిస్తున్నారు. సోమవారం విద్యాసంస్థలకు పని దినమైనా బస్సులు పంపాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదని స్కూళ్ల యాజమాన్యాలకు సమాచారం పంపారు.