YS Jagan : ఆదుకోని నవరత్నాలు.. నివారించలేకపోయిన బటన్ నొక్కుడు.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ!
ABN, First Publish Date - 2023-11-04T03:19:33+05:30
జగన్ సర్కారు గొప్పగా చెబుతున్న నవరత్నాలు ఆదుకోలేకపోయాయి. బటన్ నొక్కుడుతో డబ్బుల పంపిణీ వలసలను నివారించలేకపోయింది.
తెలంగాణకు రైతులు, కూలీల వలస
జిల్లా నుంచి రోజుకు వెయ్యి కుటుంబాలు
ఆదుకోని నవరత్నాలు, ఉపాధి హామీ
టీడీపీ ప్రభుత్వంలో వలసల నివారణకు
30ు వరకు వేసవి అలవెన్సు బోనస్
కరువు నివారణకు ప్రాజెక్టులకు శ్రీకారం
జగన్ సీఎం అయ్యాక వేసవి భత్యం కట్
సాగు ప్రాజెక్టులనూ అటకెక్కించిన వైనం
(కర్నూలు-ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు గొప్పగా చెబుతున్న నవరత్నాలు ఆదుకోలేకపోయాయి. బటన్ నొక్కుడుతో డబ్బుల పంపిణీ వలసలను నివారించలేకపోయింది. ఊళ్లో పనులు లేక, కరువుతో పస్తులు ఉండలేక చంటి పిల్లలతో పనులు వెతుక్కుంటూ వలసలు వెళ్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఎంతో మంది తెలంగాణ, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దసరా తర్వాత వలసలు మరింత జోరయ్యాయి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. కోడుమూరు మండలం కల్లపారి గ్రామం నుంచి శుక్రవారం ఒక్కరోజే వంద కుటుంబాలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి తీసే పనులకు వెళ్లాయి. దసరా తరువాత కర్నూలు జిల్లా నుంచి రోజుకు వెయ్యి కుటుంబాలు సరిహద్దులు దాటి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని అంచనా. వలసలు ఆపాలనే లక్ష్యంతో గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పనుల్లో 30 శాతం వరకు వేసవి అలవెన్సు బోనస్ రూపంలో ఇస్తే, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రద్దు చేశారు. ఓ వైపు కరువు.. మరోవైపు ఉపాధి హామీ పథకం ఆదుకోకపోవడంతో రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస కట్టారు.
రోజూ పదుల వాహనాల్లో..
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కల్లపారి గ్రామంలో దాదాపు 550 కుటుంబాలు ఉన్నాయి. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టు ఉన్నా గత పాతికేళ్లుగా సాగునీరు అందని ద్రాక్షగా మారింది. వర్షాధారంగా పత్తి, ఆముదం, వేరుశనగ వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 75-80 శాతానికి పైగా పంటలు ఎండిపోయాయి. ఊరిలో పనులు కూడా లేవు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు పత్తి తీత పనులకు ఒక్క రోజే వందకు పైగా కుటుంబాలు వలస వెళ్లా యి. కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామం నుంచి రెండు వాహనాల్లో రైతులు, కూలీలు జిల్లా సరిహద్దులు దాటారు. కర్నూలు నగరం సమీపంలో ఆంధ్ర సరిహద్దు దాటి రోజూ పదుల సంఖ్యలో వలస బండ్లు తెలంగాణకు వెళ్తున్నాయని సరిహద్దు చెక్ పోస్టు అధికారి ఒకరు చెప్పారు. దసరా పండగ తర్వాత ఆలూరు, కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. రైతులు, వారినే నమ్ముకున్న వ్యవసాయ కూ లీలు పి ల్లాపాపలతో మూటముల్లే సర్దుకొని వ లస బండెక్కుతుంటే.. ‘బిడ్డా..! పనికెళ్లిన కాడ జాగ్రత్తగా ఉండూ..’ అంటూ ఉబికి వస్తున్న క న్నీళ్లను తుడుచుకుంటూ వృద్ధులు సాగనంపుతున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
జగన్ వచ్చాక ‘అలవెన్సు’ కట్
వేసవి కాలంలో ఎండల తీవ్రతకు భూమి గట్టిపడుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలు, ఊట చెరువులు తవ్వాలంటే గడ్డపారలు భూమిలో దిగక.. రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కూలి పడదు. రోజు వారీ పనుల్లో సగం కూడా చేయలేని పరిస్థితి. దీంతో కూలి గిట్టుబాటు కాక వలస బాట పట్టేవారు. వలసలు నివారించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి నుంచి మే నెల వరకు చేసిన పని మొత్తంలో 30 శాతం వరకు సమ్మర్ అలవెన్సు (వేసవి భత్యం) బోన్‌సగా ఇచ్చేవారు. ఇది కూలీలకు ఎంతో ఉపయోగపడేది. జగన్ ప్రభుత్వం వచ్చాక 2021 నవంబరు నుంచి ఉపాధి హామీ పనుల్లో వేసవి ఆలనెన్సు రద్దు చేశారు. ఎంత పని చేస్తే అంతే కూలిఇస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాదని కూలీలు వలసబాట పడుతున్నారు. కర్నూలు జిల్లాలో 26 మండలాలు ఉంటే 22 మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా కరువు మండలాలుగా గుర్తించారు. ఉపాధి పనుల్లో 50 శాతం వేసవి అలవెన్సు బోన్‌సగా ఇచ్చి గ్రామాల్లో పనులు చేపడితే వలసలు కొంతవరకు ఆపొచ్చు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కన్నీళ్లు ఆగలేదు
వలస బండిలో చంటిపాపతో ఉన్న ఈ తల్లి పేరు సుజాత. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామం. ఇంటికి కాపలాగా మామయ్యను పెట్టి పాలు తాగే పసి పాప, ఐదేళ్ల కొడుకు సహా భర్త, అత్తతో కలసి తెలంగాణలో పత్తి తీసే పనులకు వలస వెళ్లారు. వీరికి గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఆముదం, పత్తి పంటలు వేస్తే వానలు పడలేదు. ఎండల తీవ్రతకు పూర్తిగా ఎండిపోయాయి. తెలంగాణలో కిలో పత్తి తీస్తే రూ.10-11 ఇస్తున్నారు. ముగ్గురు కష్టపడితే చేసిన అప్పులు తీర్చవచ్చని వలస వెళ్తున్నామని ఆమె అన్నారు. ‘మా పొలంలో పది మందికి పని చూపే మేము బతకడానికి వలస వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. బిడ్డా..! పనికాడ పిల్లలు జాగత్ర అని మామ చెప్పి సాగనంపినప్పుడు కన్నీళ్లు ఆగలేదు’ అని సుజాత కన్నీటిపర్యంతమయ్యారు.
అటకెక్కిన ప్రాజెక్టులు
ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెసీమల్లో వలసలు శాశ్వతంగా నివారించాలంటే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరముంది. వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వలసల నివారణ కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.3,987 కోట్లు మంజూరు చేసి వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు చేపట్టింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని అటకెక్కించారు. 2019 ఫిబ్రవరి 21న గుండ్రేవుల జలాశయానికి రూ.2,980 కోట్లు మంజూరు చేస్తూ ఆనాటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 153 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సరిహద్దు సమస్య అంటూ గుండ్రేవులకు పాతర వేసింది. ఈ ప్రాజెక్టులు నిర్మించి ఉంటే కొంతైనా వలసలు ఆగేవని రాయలసీమ సాగునీటి నిపుణులు అంటున్నారు.
ఆరు ఎకరాల్లో పత్తి ఎండిపోయింది
నాకు ఎకరా పొలం ఉంది. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో పత్తి వేశాను. సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి మట్టిపోస్తే పిడికెడు పత్తి కూడా రాలేదు. పంటంతా ఎండిపోయింది. ఆ అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలతో కలసి తెలంగాణలో పత్తి తీత పనులకు వలస వెళ్తున్నాం.
- గిడ్డయ్య, కౌలు రైతు, పోతుగల్లు గ్రామం, కృష్ణగిరి మండలం
ఊరిలో పనులు లేవు
ఇలాంటి కరువు మునుపెన్నడూ చూడలేదు. ఖరీఫ్ పంట కోతలు అయిపోయాక సంక్రాంతి పండగ చేసి బతికేందుకు వెళ్లే వాళ్లం. ఈ ఏడాది ఒట్టి కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయాయి. ఊరిలో పనులు లేవు. ప్రభుత్వం ఉపాధి పనులు పెట్టలేదు. ఊర్లోనే పనులుంటే మాకు వలస కష్టాలెందుకు వస్తాయి?
- శాంతన్న, కల్లపారి గ్రామం,
కోడుమూరు మండలం
Updated Date - 2023-11-04T08:24:08+05:30 IST