Ganta Srinivasrao: గూగుల్ మిన్న... గురువులు సున్నా... ఇదేమి సన్మానం మంత్రి గారు?
ABN, First Publish Date - 2023-09-06T14:44:00+05:30
గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivasrao) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గూగుల్ మిన్న... గురువులు సున్నా... ఇదేమి సన్మానం మంత్రి గారు. గురుపూజోత్సవం రోజున గురువును పూచికపుల్లతో సమానంగా తీసి పడేశారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయునికి ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోండి.. గూగుల్‌కు కంటెంట్‌ను అందించేది కూడా ఒక గురువు అనే సంగతి గమనించండి మంత్రి గారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా గూగుల్ చదువులు లేవు... గురువులే చదువులు చెబుతున్నారనే సంగతి గుర్తించండి. గూగుల్ కంటెంట్ మాత్రమే ఇస్తుంది. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ధి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో గురువుల పాత్ర ఎంతో విలువైందని గమనించండి. గూగుల్ సీఈఓ "సుందర్ పిచై" కూడా తన గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించినవాడే. గురువు అంటే సమసమాజ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించాల్సిన వారు. రేపటి సమాజం ఎలా ఉంటుందో నేడు గురువులను బట్టే ఉంటుంది. నేటి సమాజం సహజంగా నిన్నటి గురువుల సృష్టే. అలాంటి గురువును మీరు గురుపూజోత్సవం సభలో అగౌరవ పరుస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
Updated Date - 2023-09-06T14:44:00+05:30 IST