అది ‘బ్లూవేల్’ కాదు ‘బ్రైడ్’ తిమింగలం
ABN , First Publish Date - 2023-07-30T02:42:54+05:30 IST
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం వద్ద తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం ‘బ్లూ వేల్’ కాదని అది ‘బ్రైడ్’ రకానికి చెందినదని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం సైంటిస్ట్ ప్రసాద్ శనివారం తెలిపారు.

ఆహారం కోసం వచ్చి చిక్కుకుపోయింది
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం వద్ద తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం ‘బ్లూ వేల్’ కాదని అది ‘బ్రైడ్’ రకానికి చెందినదని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం సైంటిస్ట్ ప్రసాద్ శనివారం తెలిపారు. ఈ తిమింగలం ఈ నెల 27న తీరానికి కొట్టుకు వచ్చి, తిరిగి వెళ్లలేక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రకం తిమింగలం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఇంతవరకు ఎక్కడా చిక్కుకోలేదని, ఇది మొదటిదని ప్రసాద్ వివరించారు. తమిళనాడు, కేరళ, గుజరాత్, లక్షదీవులు, పశ్చిమ బెంగాల్‌లోనే వీటిని గుర్తించారన్నారు. నెత్తళ్లు, కానాగడతలను ఆహారంగా తీసుకుంటుందని, ఉపరితలంపైనే సంచరిస్తుందని, ఆహారం కోసం తీరానికి వచ్చి చనిపోయినట్టుగా భావిస్తున్నామన్నారు. వీటిని అరుదైన జాతికి చెందిన వాటిగా గుర్తించి, సంరక్షించాల్సిన క్షీరదాల జాబితాలో కేంద్రం చేర్చిందన్నారు. దీని పొడవు 32.5 అడుగులు, వెడల్పు 6.5 అడుగులు కాగా ఐదు టన్నుల వరకు బరువు ఉంటుందని అంచనా వేశామన్నారు.