Lokesh: ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు.. జగన్‌కు లోకేశ్ లేఖ
ABN, First Publish Date - 2023-09-05T14:40:37+05:30
ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు.
పశ్చిమగోదావరి: ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి (AP CM YS Jaganmohan reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) లేఖ రాశారు. ఉక్రెయిన్‌లోని యుద్ధ పరిస్థితుల కారణంగా తెలుగు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున తమ విద్యను కొనసాగించేందుకు చాలా మంది విద్యార్థులు భారత్ నుంచి ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఫలితంగా ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేక, మనదేశంలో తమ చదువులు కొనసాగించలేక విద్యార్థుల విలువైన కాలం వృధా అవుతోందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు వారి వైద్య విద్యను కొనసాగించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి తగు అవకాశాలు కల్పించటం చాలా ముఖ్యమన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సంబంధిత విద్యా సంస్థల నుంచి సర్టిఫికేట్లను తిరిగి ఇప్పించే చర్యలు తీసుకోవాలని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-09-05T14:40:41+05:30 IST