ఏసీసీ, అంబుజా కొనుగోళ్లలో అదానీ గ్రూప్ మరో మాయ
ABN , First Publish Date - 2023-03-14T02:35:25+05:30 IST
అదానీ గ్రూప్ మరో మాయాజాలం బయట పడింది. గత ఏడాది కొనుగోలు చేసిన ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలు అదానీ గ్రూప్‌నవి కావని తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల అసలు...

పేరుకే గ్రూప్ పేరుతో లావాదేవీలు.. తుది లబ్దిదారు వినోద్ అదానీనే
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మరో మాయాజాలం బయట పడింది. గత ఏడాది కొనుగోలు చేసిన ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలు అదానీ గ్రూప్‌నవి కావని తెలుస్తోంది. ఈ రెండు కంపెనీల అసలు లబ్దిదారుడు గ్రూప్ ప్రధాన ప్రమోటర్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ అని ‘ది మార్నింగ్ కాంటెక్ట్స్’ అనే పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. మారిష్‌సలోని తన కంపెనీ ‘ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వె్‌స్టమెంట్ లిమిటెడ్’’ ద్వారా వినోద్ అదానీ ఈ కొనుగోలుకు అవసరమైన 1,050 కోట్ల డాలర్లు (సుమారు రూ.85,000 కోట్లు) సమకూర్చారని ఆ పత్రిక పేర్కొంది.
ఎవరీ వినోద్ అదానీ?
వినోద్ అదానీ స్వయానా గౌతమ్ అదానీ అన్న. ఈయన ఒక ప్రవాస భారతీయుడు. ఈయనకు తమ గ్రూప్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని అదానీ గ్రూప్ చెబుతుంటుంది. అయితే అదానీ గ్రూప్ షేర్ల దందా, విదేశాల నుంచి నిధుల సమీకరణల్లో ఈయనది కీలక పాత్ర. హిండెన్‌బర్గ్ రీసెర్చి ఈ ఏడాది జనవరి 24న విడుదల చేసిన తన నివేదికలో కూడా ఈయన గారి పేరు దాదాపు 151 సార్లు ప్రస్తావించింది. మారిషస్, సైప్రస్, యూఏఈ, కరేబియన్ ఐలాండ్స్ వంటి పన్నుల ఎగవేత స్వర్గ ధామాల్లో ఈయన అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు అక్కడి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల దందాకు నిధులు సమకూరుస్తుంటారని చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా అదానీ గ్రూప్ పేరుతో ఏకంగా ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలను కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సెబీ దర్యాప్తు చేస్తోంది..
అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు చేస్తోందని ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య కాలంలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 60 శాతం పతనమవటంతో స్టాక్ మార్కెట్లపై ఎంత మేరకు ప్రభావం పడిందనే విషయంపై సెబీ విచారణ సాగిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి తెలిపారు.
ఎల్‌ఐసీ అప్పులు రూ.6,183 కోట్లు: అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన అప్పుల్ని ఎల్‌ఐసీ క్రమంగా తగ్గించుకుంటోంది. గత ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి రూ.6,347.32 కోట్ల వరకు ఉన్న ఈ అప్పులు ఈ నెల 5వ తేదీ నాటికి స్వల్పంగా తగ్గి రూ.6,183 కోట్లకు చేరాయి. లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం చెప్పారు.