Share News

Visakha Steel Lands for Sale : అమ్మకానికి విశాఖ ఉక్కు భూములు

ABN , First Publish Date - 2023-11-15T02:12:13+05:30 IST

అప్పుల భారం, నష్టాలు తగ్గించుకునేందుకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) కొత్త ప్రయత్నాలు చేస్తోం ది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఉత్తరప్రదేశ్‌లోని...

Visakha Steel Lands for Sale : అమ్మకానికి విశాఖ ఉక్కు భూములు

రాయ్‌బరేలీలోని ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ ఫ్యాక్టరీ కూడా.. 4,000 కోట్లు సమకూరే అవకాశం

  • వైజాగ్‌ స్టీల్‌ సీఎండీ అతుల్‌ భట్‌

కోల్‌కతా: అప్పుల భారం, నష్టాలు తగ్గించుకునేందుకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) కొత్త ప్రయత్నాలు చేస్తోం ది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఏర్పాటు చేసిన ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ ప్లాంట్‌ తో పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లోని మిగు లు భూముల్లో కొంత భాగం అమ్మాలని భావిస్తోంది. ఈ అమ్మకం ద్వారా ఎంత లేదన్నా రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీ అతుల్‌ భట్‌ చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ నిధులు సమకూరితే వైజాగ్‌ స్టీల్‌ మళ్లీ నగదు లాభాల్లోకి వస్తుందన్నారు.

మొత్తం 19,000 ఎకరాలు

విశాఖ ఉక్కు కోసం 19,000 ఎకరాల భూములు సేకరించారు. అందు లో 6,000 ఎకరాలు గ్రీన్‌ బెల్ట్‌ కింద వదిలేశారు. ఇది పోను మిగతా భూమి లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇందులో 22.9 ఎకరాల్లో విస్తరించి ఉన్న 588 ప్లాట్లను, రెండు ఎకరాల్లో ఉన్న 76 నివాస గృహాలను అమ్మడం ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించవచ్చని యాజమాన్యం భావిస్తోంది. కార్మిక సంఘాలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాయి. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వం రూ.5,000 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ సమకూరిస్తే స్టీల్‌ ప్లాంట్‌ మళ్లీ లాభాలబాట పడుతుందని చెబుతున్నాయి.

రూ.23,000 కోట్ల అప్పులు

స్టీల్‌ ధరలు తగ్గటంతో గత రెండు మూడేళ్లుగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలు చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లోనూ రూ.3,000 కోట్లు నష్టాలు చవిచూసింది. రూ.23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్‌ఐఎన్‌ఎల్‌ను కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్‌ మార్కెట్‌ నుంచి కొనడంతో టన్నుకు రూ.6,000 వరకు భారం పడుతోందని భట్‌ చెప్పారు.

Updated Date - 2023-11-15T02:12:15+05:30 IST