BJP: బీజేపీ అభ్యర్థి కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2023-11-17T10:01:08+05:30
ఛత్ పూజకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు చెప్పడంతో పోలీసు స్టేషన్ ముందు గురువారం రాత్రి పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి టి.నందీశ్వర్‌గౌడ్
పటాన్‌చెరు(సంగారెడ్డి), (ఆంధ్రజ్యోతి): ఛత్ పూజకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు చెప్పడంతో పోలీసు స్టేషన్ ముందు గురువారం రాత్రి పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి టి.నందీశ్వర్‌గౌడ్(T. Nandishwar Goud) ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతి ఇవ్వడంలో ఉద్ధేశపూర్వకంగా జాప్యం చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని నందీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి సంధ్య, కుమారుడు ఆశిష్ గౌడ్, కుమార్తె, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ చేరుకుని సీఐ లాలూనాయక్‌ను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి బీజేపీ(BJP) సభలకు అనుమతులు ఇవ్వడం లేదని వాగ్వాదానికి దిగారు. అంతలోనే నందీశ్వర్‌గౌడ్ కుటుంబ సభ్యులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు వారించి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్ ఎదుట అభ్యర్థి, అతని బంధువులు ధర్నాకు దిగారు. మైత్రీమైదానంలో ఛత్ పూజ కోసం 20రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఇక్కడ అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. మార్కెట్ కమిటీ స్థలంలో పెట్టుకోవాలని సూచించారని, అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమతి ఇచ్చేది లేదని చెప్పడం సబబుకాదన్నారు. సీఐ లాలూనాయక్‌ను తక్షణం బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్‌పీతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2023-11-17T10:04:24+05:30 IST