ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: ఆ అజెండాలో భాగంగానే ఇలా జరిగిందా? దండయాత్ర మొదలైనట్లేనా!

ABN, First Publish Date - 2023-10-04T01:26:05+05:30

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలు అరెస్టు వెనక ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి హస్తం బయటకు కనిపిస్తున్నప్పటికీ.

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలు అరెస్టు వెనక ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి హస్తం బయటకు కనిపిస్తున్నప్పటికీ, పరోక్షంగా కేంద్రంలోని మోదీ సర్కారు అండ, అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ పని చేయగలుగుతుందా అన్న అనుమానాలు బలంగానే ఉన్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటికి ఉనికే లేకుండా చేయాలన్న వ్యూహంలో భాగంగా బీజేపీ దృష్టి తెలుగుదేశంపై పడిందా?

వెయ్యేళ్ల తర్వాత భారతదేశంలో హిందూ సామ్రాట్‌ పాలన ప్రారంభమైందని మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో బీజేపీ నేతలు చెప్పుకొనేవారు. ఈ పాలనలో బీజేపీకి అనేకానేక జ్ఞాత, అజ్ఞాత లక్ష్యాలున్నాయి. వాటిలో ఒకటి, దేశంలో బీజేపీ తప్ప మరే ఇతర పార్టీనీ బతకనివ్వకపోవటం. బీజేపీ ప్రవచించే ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒకే ఎన్నిక జాబితా చాలా పెద్దది. ఈ జాబితాలో తదుపరి వచ్చేవి ఒకే పార్టీ, ఒకే నేత, ఒకే మతం, ఒకే ధర్మం. ఒకే పార్టీ అంటే బీజేపీ, ఒకే నేత అంటే నరేంద్రమోదీ, ఒకే మతం అంటే హిందూమతం, ఒకే ధర్మం అంటే మనుధర్మం. ఈ సుదీర్ఘ అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీ, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను బలహీనపరచటంపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అనే నినాదాన్ని ఇచ్చింది. ఆ దిశగా గణనీయమైన విజయాలనే సాధించింది. కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని సీట్లు కూడా రాకుండా ఎన్నికల రణరంగంలో చిత్తుగా ఓడించగలిగింది. రాహుల్‌గాంధీని అసమర్థుడిగా చిత్రీకరించే ప్రచారవ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఈ తొమ్మిదేళ్లకాలంలో అనేక అపహాస్యాలను, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌లను ఎదుర్కొన్న రాహుల్‌గాంధీ ఇప్పుడిప్పుడే ఆ ‘అసమర్థుడి’ ముద్ర నుంచి బయటపడుతున్నారు. కాంగ్రెస్‌ విషయంలో అనుకున్న ఫలితాలను సాధించిన బీజేపీ.. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలను బలహీనపర్చటంపై రెండోదశలో దృష్టి పెట్టింది.

మోదీ హయాంలో తొలినుంచీ చూస్తున్నదేమిటంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఎటువంటి మొహమాటాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లటమే. సమాజంగానీ, ప్రపంచంగానీ ఏమనుకుంటుంది అన్న భయం మచ్చుకైనా కానరాదు. అంటే, పూర్వకాలంలో రాజులు అశ్వమేధయాగం జరిపిన విధంగా అన్నమాట. ఆ అశ్వం ఎక్కడెక్కడికి వెళ్తే ఆ ప్రాంతమంతా రాజుదే. ‘నాకు లొంగి సామంతుడిగా ఉంటావా? యుద్ధంలో చస్తావా?’ రెండే రెండు ప్రత్యామ్నాయాలు. ప్రాచీనత పట్ల ఎంతో అనురక్తి ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముద్దుబిడ్డ బీజేపీ ఈ ఆధునికకాలంలో కూడా వాటిని పాటిస్తోంది. చట్టబద్ధపాలనగానీ, న్యాయస్థానాలుగానీ, పౌరసమాజం విమర్శగానీ, అంతర్జాతీయంగా నగుబాటు కావటంగానీ ఇవేవీ దానికి పట్టవు. లొంగకపోతే ఈడీలు, బేడీలు, జైళ్లు. ప్రత్యర్థి శిబిరంలోని ప్రాంతీయపార్టీలనే కాదు, తమ ఎన్‌డీఏ శిబిరంలోని పార్టీలనూ డొల్ల చేయటంపైనా అది దృష్టి పెట్టింది. ఎన్‌డీఏలోనే ఉన్న అన్నాడీఎంకే తొలిగా అలా దెబ్బతిన్నది. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ శశికళ కేంద్రంగా బలోపేతం అవుతున్న దశలో, ఆమెను అరెస్టు చేయించి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య ఆ పార్టీ రెండుగా చీలే పరిస్థితులను సృష్టించింది బీజేపీ. తమిళనాడులో బలమైన రాజకీయ పార్టీ అయిన అన్నాడీఎంకే నేడు ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. ఇక పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌నూ బలహీనపరిచే ప్రయత్నాలు చేయడంతో ఎన్‌డీఏతో ఉన్న 24 ఏళ్ల బంధాన్ని తెంచుకొని అకాలీదళ్‌ బయటకు వచ్చింది. తర్వాత దశలో బీజేపీ చూపు మరో చిరకాల మిత్రపక్షమైన శివసేనపై పడింది. ఎన్డీయేను వీడి కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని, పార్టీని అస్థిరపర్చటానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. చివరకు ఏక్‌నాథ్‌శిండేతో శివసేనలో చీలిక తెప్పించి, ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని కూల్చటమేగాక, తాజాగా మరో ప్రాంతీయపార్టీ ఎన్సీపీని అజిత్‌పవార్‌ ద్వారా చీల్చి శరద్‌ పవార్‌ను దెబ్బతీసింది. బిహార్‌లో మిత్రపక్షంగా ఉన్న జేడీయూలోనూ బీజేపీ తిరుగుబాటును ప్రోత్సహించింది. అయితే, బీజేపీ రాజకీయాల గురించి తెలిసిన నితీశ్‌ తనపై దాడి జరగకముందే ప్రతిదాడి జరిపి తనను తాను రక్షించుకున్నారు. ఎన్‌డీఏకు గుడ్‌బై చెప్పి, ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


బీజేపీ దృష్టి ఇప్పుడు టీడీపీపై పడిందా? తెర వెనుకనుంచి చంద్రబాబు అరెస్టు తతంగాన్ని నడిపిస్తోందా? అన్న సందేహాలు ప్రజల్లో, రాజకీయపక్షాల్లో తలెత్తుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం, కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా ఇది జరిగే అవకాశమే లేదని వివిధ పార్టీల నేతలు అంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో, దేశంలోని ప్రాంతీయపార్టీలు తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనపెట్టి, బీజేపీతో సమష్టిగా తలపడితే తప్ప ఈ దాడిని ఎదుర్కోలేవు. ఇప్పటికే ఇండియా కూటమి రూపంలో ఐక్యత దిశగా ముందడుగు పడింది. దీనిని మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ ఉండాలి. అయితే, బీజేపీ దండయాత్రను ఎదుర్కోవటానికి పార్టీలు చేతులు కలిపితే సరిపోదు. పార్టీల కలయిక వల్ల తాత్కాలిక విజయాలు సాధ్యమవుతాయేమోగానీ శాశ్వత విజయం లభించదు. బీజేపీని నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కోకుండా ఇది సాధ్యం కాదు. భారతదేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. ఆకర్షణీయంగా కనిపించే ఈ పదానికి అర్థం ఏమిటి? నేడు దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే వారిలో హిందువుల సంఖ్య 110 కోట్లు. వీరు మూడు వేల కులాలుగా, 25 వేల ఉపకులాలుగా విడిపోయి ఉన్నారు. ఈ సామాజిక అంతరాలకు తోడు ఆర్థిక, లింగపరమైన అంతరాలు ఉన్నాయి. వీటిని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా పరిష్కరిస్తుంది? దాని వద్ద ఉన్న ప్రణాళికలేమిటి? లేక, అనేకమంది అనుమానిస్తున్న విధంగా మనుధర్మంలోని చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం, కులాల అంతరాలను మరింత బలోపేతం చేస్తుందా? స్త్రీలపై వివక్షను మరింత పటిష్ఠపరుస్తుందా? ఆర్థిక అంతరాలను పాపపుణ్యాలతో ముడిపెట్టి శాశ్వతం చేస్తుందా? వీటన్నింటిపై విస్తృతమైన చర్చలు జరిగి యావత్‌ దేశప్రజానీకానికి లోతైన అవగాహన కలిగించాలి.

కె.వి. రవికుమార్‌

పాత్రికేయుడు

Updated Date - 2023-10-04T10:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising