ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ఆచార్యులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వర్సిటీలు! పేరుకే బడ్జెట్‌లో ప్రకటన.. విడుదలలో మాత్రం..!

ABN, First Publish Date - 2023-03-13T13:14:29+05:30

2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పలు యూనివర్సిటీల్లో జీతాల కటకట మొదలైంది. టీచింగ్‌ (Teaching), నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు

పద్దుకు ఎగనామం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జీతాలకు తప్పని నిరీక్షణ!

యూనివర్సిటీల నిర్వహణ పద్దుకు ఎగనామం

‘ఆర్థికం’ ముగుస్తున్నా అరకొరగా విడుదల

ముగిసిన మూడు త్రైమాసికాల్లో అత్తెసరే

అంబేడ్కర్‌ వర్సిటీ, జేఎన్‌టీయూ, ఫైన్‌ఆర్ట్స్‌లకు కోతలు

2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పలు యూనివర్సిటీల్లో జీతాల కటకట మొదలైంది. టీచింగ్‌ (Teaching), నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు (salaries) చెల్లించడం వర్సిటీలకు సవాల్‌గా మారింది. ఈ లోపు చివరి త్రైమాసికం బడ్జెట్‌ నిధులను విడుదల చేస్తే సరే.. లేకుంటే పలుయూనివర్సిటీల్లో వేతన చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల (Universities) నిర్వహణ కోసం రాష్ట్ర బడ్జెట్‌ (State budget)లో యేటా కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నా సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. యూనివర్సిటీల నిర్వహణ పద్దు కింద చెల్లించాల్సిన నిధులను అరకొరగానే విడుదల చేస్తుండడంతో వర్సిటీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఎక్కడికక్కడే కోతలు పెడుతున్నారు. కేటాయించాల్సిన నిధులను ఎగనామం పెడుతున్నారు.

కేటాయింపులు ఘనం

ఉస్మానియా యూనివర్సిటీతోపాటు తెలుగు వర్సిటీ, జేఎన్‌టీయూ, జేఎన్‌ఏ ఫైన్‌ ఆర్ట్స్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీల నిర్వహణకు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది జీతభత్యాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. కేటాయింపులు భారీగా ఉంటుండగా విడుదల మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. దీంతో జీతభత్యాలకు, ఇతరత్రా నిర్వహణకు ఆయా వర్సిటీలకు ఇబ్బందులు తప్పడం లేదు. బడ్జెట్‌లో 2020-21లో రూ.344 కోట్లతో ఉన్న ఉస్మానియా వర్సిటీ బడ్జెట్‌ 2023-24కు రూ.457కోట్లకు పెరిగింది. మూడేళ్లలోనే వంద కోట్లకు పైగా పెరగ్గా, తెలుగు, జేఎన్‌టీయూ, జేఎన్‌ఏ ఫైన్‌ ఆర్ట్స్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీల బడ్జెట్‌ మూడేళ్లలో రూ.10కోట్ల నుంచి రూ.20కోట్ల మేర పెరిగింది. పెరిగిన ప్రకారం వర్సిటీలకు నిధులు విడుదల చేయడం లేదు.

ఏటా రూ.3కోట్ల-రూ.5కోట్లు కోత

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి (Dr. BR Ambedkar Open University) 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ పద్దు కింద రూ.17.53కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు కనీసం రూ10కోట్లు కూడా విడుదల చేయలేదు. నిర్వహణ పద్దు కింద వచ్చే నిధులను వర్సిటీ నిర్వహణ, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది జీత భత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో కేటాయించిన నిర్వహణ పద్దు నిధులను త్రైమాసికం ప్రకారం నాలుగు విడతలుగా విడుదల చేస్తారు. ఇప్పటి వరకు మూడు త్రైమాసికాలు పూర్తయినా.. ఆ మేరకు నిధులు విడుదల చేయలేదు. నాలుగో త్రైమాసికం కూడా ముగిసేందుకు వస్తున్నా నిధులు రాలేదు. వస్తాయా? రావా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో 11.94కోట్లు కేటాయించి కేవలం రూ.8.71కోట్లు మాత్రమే విడుదల చేశారు. రూ.3కోట్లకు పైగా కోత పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.17.53 కోట్ల నిధులను భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయి. దీంతో వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది జీత భత్యాలు చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ లోపు నిధులు విడుదల చేయకపోతే ఫిబ్రవరి నెల జీతాలు చెల్లింపులు నిలిచిపోయే అవకాశాలున్నాయి.

జేఎన్‌టీయూ, ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీలకూ..

జేఎన్‌టీయూకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.34.01కోట్లను కేటాయిస్తే కేవలం రూ.8.25కోట్లను మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా రూ.44.21కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తే ఇప్పటి వరకు సగం కూడా నిధులు విడుదల చేయలేదు. జేఎన్‌టీయూ కింద అనుబంధ గుర్తింపు ఇంజనీరింగ్‌ కాలేజీలు పెద్ద సంఖ్యలో ఉండడంతో సీట్ల మంజూరు సందర్భంగా ఫీజులు వస్తుంటాయి. వర్సిటీ అనుబంధం కోసం ఫీజులు వస్తుంటాయి. దీంతో కొంత మేరకు నిధులు సమకూరుతున్నాయి. ఆయా నిధులను జేఎన్‌టీయూ సర్దుబాటు చేసుకుంటోంది. కానీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జీతభత్యాలకు ఇబ్బందులు తప్పడంలేదు. భారీగా నిధులకు కోత పెడుతున్న ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి జేఎన్‌టీయూకు రూ.48.94కోట్లను కేటాయించడం విశేషం. జేఎన్‌ఏ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీకి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.18.56కోట్లను కేటాయించి రూ.15.46 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.24.12కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు కనీసం రూ.20కోట్లు కూడా విడుదల చేయలేదు. కానీ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.26.71కోట్లను కేటాయిస్తున్నట్లు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించడం విశేషం.

ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగుతారనే..

ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) రాష్ట్ర బడ్జెట్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు కేటాయింపుల ప్రకారం విడుదల చేశారు. రూ.353.89 కోట్లను నిర్వహణ పద్దు కింద కేటాయించి ఆ మేరకు చెల్లింపులు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.418.06 కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు రూ.300కోట్లకు పైగా విడుదల చేసినట్లు తెలిసింది. చివరి త్రైమాసికం ముగిసే వరకు మిగతా నిధులను కూడా కేటాయించే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలిపారు. ఓయూకు నిర్వహణ పద్దు కింద నిధులు విడుదల చేయకపోతే వేలాదిగా చదువుతున్న విద్యార్థుల చదువులపై ప్రభావం పడే అవకాశముందని, వర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగే పరిస్థితి ఉండడంతోనే క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు.

Updated Date - 2023-03-13T13:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising