Cancer జయించడం ఇలా..
ABN , First Publish Date - 2023-01-31T11:09:53+05:30 IST
కేన్సర్ (Cancer) సోకితే కథ కంచికే అనుకుంటాం! కానీ తగినంత అప్రమత్తతతో వ్యాధిని ముందుగానే కనిపెట్టగలిగితే కేన్సర్ నుంచి రక్షణ పొందడం సాధ్యమే!
ఫిబ్రవరి 4 వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా
కేన్సర్ (Cancer) సోకితే కథ కంచికే అనుకుంటాం! కానీ తగినంత అప్రమత్తతతో వ్యాధిని ముందుగానే కనిపెట్టగలిగితే కేన్సర్ నుంచి రక్షణ పొందడం సాధ్యమే! అంతే కాదు. అందుబాటులో ఉన్న తాజా వ్యాధినిర్థారణ పరీక్షలు,సమర్థమైన చికిత్సలతో ఈ వ్యాధి మీద పోరాటంలో పైచేయి సాధించవచ్చు అంటున్నారు వైద్యులు.
కేన్సర్ సోకుతుందనే భయం ఉన్నవాళ్లు, శరీరాన్నంతా స్కానింగ్ (Scanning)చేయమని వైద్యులను అడుగుతూ ఉంటారు. శరీరంలో దాగి ఉన్న వ్యాధిని కనిపెట్టి, దాని అంతు చూడాలనే తాపత్రయం వాళ్లది. కానీ ఒకే ఒక పరీక్షతో అన్ని రకాల కేన్సర్ కణాలనూ కనిపెట్టడం సాధ్యం కాదు. అలాంటి పరీక్షలు ఏవైనా అందుబాటులో ఉన్నప్పటికీ వాటితో కచ్చితంగా కేన్సర్ కణాలను కనిపెట్టవచ్చని శాస్త్రీయంగా నిర్థారణ కాలేదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. రక్తంలో ప్రయాణించే ట్యూమర్ సెల్స్‌ను కనిపెట్టే పరీక్ష కూడా కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది అప్పటికే సోకిన కేన్సర్‌ను కనిపెట్టగలుగుతుందే తప్ప, సోకే అవకాశాలను కనిపెట్టలేదు. కాబట్టి ముందు నుంచీ అనుసరిస్తున్న కేన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలనే అనుసరించడం ఉత్తమం. రొమ్ము కేన్సర్ (Breast cancer)ను స్వీయ పరీక్షతో ముందుగానే కనిపెట్టవచ్చు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను పాప్‌స్మియర్, క్లినికల్ ఎగ్జామినేషన్‌తో, పెద్దపేగు కేన్సర్ (Colon cancer)ను మోషన్ ఫర్ అక్కల్ట్ బ్లడ్ పరీక్షతో, లంగ్ కేన్సర్‌ను ఎక్స్‌రేతో, స్మోకర్ల లంగ్ కేన్సర్‌ను సిటి స్కాన్ (CT scan)తో ప్రారంభ దశలోనే కనిపెట్టే వీలుంది.
కేన్సర్ ముప్పును కనిపెట్టే ‘జెనెటిక్ టెస్టింగ్’
వంశపారంపర్యంగా కేన్సర్ సోకే వీలున్న రిస్క్ గ్రూపుకు చెందిన వాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి. వీళ్లు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం అవసరం. బ్రాకా 1 అండ్ 2 కోవకు చెందిన కేన్సర్ (రొమ్ము) ముప్పు ఉన్నవాళ్లకు సాధారణ మామోగ్రఫీకి బదులుగా ఎమ్‌ఆర్‌ఐ మామోగ్రఫీ పరీక్ష ఉపయోగపడుతుంది. 35 నుంచి 40 ఏళ్ల మఽధ్య మహిళలకు ఈ పరీక్షలో పాజిటివ్ ఫలితం వస్తే, రెండు అండాశయాలతో పాటు, ఫెలోపియన్ ట్యూబులను కూడా తొలగిస్తే, రొమ్ము కేన్సర్ నుంచి రక్షణ దక్కుతుంది. అలాగే చిన్న వయసులోనే శరీరం మీద ఎక్కువ మొత్తాల్లో పులిపుర్లు తలెత్తే వాళ్లు పెద్దపేగు కేన్సర్ ముప్పు ఉందని గ్రహించాలి. ఈ కోవకు చెందిన వాళ్లు కేన్సర్ నుంచి తప్పించుకోవడం కోసం, 15 నుంచి 20 వయసుకు చేరుకున్న వెంటనే, పూర్తి పెద్దపేగును తొలగించుకోవలసి ఉంటుంది. అలాగే మెడుల్లరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ కుటుంబ చరిత్రలో కలిగి ఉన్నవాళ్లు థైరాయిడ్ కేన్సర్ సోకక ముందే ఆ గ్రంథిని తొలగించుకోవాలి. జీబాలు కిందకు దిగని వాళ్లలో వృషణాల కేన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటి వాళ్లకు కిందకు జారని వృషణాన్ని తొలగించవలసి ఉంటుంది. ఇలా కేన్సర్ రాకుండా ముందస్తు సర్జరీలతో జాగ్రత్తపడవచ్చు. అలాగే కుటుంబచరిత్రలో పెద్దపేగు, పొట్ట కేన్సర్లు ఉన్నవాళ్లు 20 ఏళ్ల వయసు నుంచే కేన్సర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అండాశయ కేన్సర్ ముప్పు ఉన్నవాళ్లు 40 ఏళ్ల నుంచి, రొమ్ము కేన్సర్ ముప్పు ఉన్నవాళ్లు 25 నుంచి 30 ఏళ్ల నుంచీ అప్రమత్తంగా ఉండాలి.
కేన్సర్ మొదటి దశలో ఉందా?
కేన్సర్ చికిత్సలన్నీ ఒకేలా ఉండవు. ప్రారంభ దశలో ఉన్న వేర్వేరు కేన్సర్లకు అందించే చికిత్సా విధానాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. తొలి దశ గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు సర్జరీ ఒక్కటే సరిపోతుంది. తదనంతర కీమోథెరపీ, రేడియేషన్ అవసరం ఉండదు. అలాగే ప్రారంభ దశలో ఉన్న రొమ్ము కేన్సర్‌కు సర్జరీతో పాటు, కీమోథెరపీ (Chemotherapy)కూడా అవసరం పడుతుంది. తొలి దశలో ఉన్న లంగ్ కేన్సర్‌కు కూడా సర్జరీ ఒక్కటే సరిపోతుంది. అలాగే తొలి దశలో ఉన్న గ్యాస్ట్రిక్ కేన్సర్, విరోచనం పేగు కేన్సర్‌లకు కూడా సర్జరీ ఒక్కటే సరిపోతుంది. కీమో థెరపీ, రేడియేషన్ (Radiation)అవసరం ఉండదు. ఇలా చికిత్స తీసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని రకాల కేన్సర్లకు కొంత కాలం పాటు మందులు వాడుకోవలసి ఉంటుంది. ఇలా తొలి దశలోనే కేన్సర్‌ను గుర్తించి, తగిన చికిత్సలు తీసుకోగలిగితే కేన్సర్ వ్యాధి నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.
కేన్సర్ చికిత్సలు భిన్నం
అన్ని రకాల కేన్సర్ల చికిత్సలకూ వైద్యులు ఒకే రకమైన ప్రొటొకాల్‌ను అనుసరించరు. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్... ఇదే క్రమాన్ని అన్ని కేన్సర్లకూ అనుసరించరు. పెద్దపేగు కేన్సర్లలో మొదట సర్జరీ, అవసరాన్ని బట్టి కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని కేన్సర్లకు సర్జరీకి బదులుగా కీమో, రేడియేషన్ అవసరమవుతుంది. కొన్ని సర్జరీ చేయకూడని కేన్సర్లు కూడా ఉంటాయి. వాటికి కేవలం కీమో, రేడియేషన్ల మీదే ఆధారపడాలి. అలా కేన్సర్ పరిమాణం, రకం, దశ, తత్వాలను బట్టి వైద్య విధానం మారుతూ ఉంటుంది. హెర్‌టు నెగటివ్, పిఆర్ పాజిటివ్, ల్యుమినల్ ఎ కోవకు చెందిన రొమ్ము కేన్సర్లకు కీమోథెరపీ, రేడియేషన్ అవసరం ఉండదు. సర్జరీతో పాటు ఎండోక్రైన్ థెరపీతో కూడిన చికిత్స సరిపోతుంది. అయితే ట్రిపుల్ నెగటివ్ కోవకు చెందిన రొమ్ము కేన్సర్‌లో సర్జరీతో పాటు కీమోథెరపీ అవసరమవుతుంది. మూడు, నాల్గవ దశలోని సర్వైకల్ కేన్సర్‌కు, లింఫోమా, ల్యుకేమియా, మైలోమాలలో సర్జరీ పాత్ర ఉండదు. అలాగే వ్యాధి దశ ముదిరినప్పుడు, సాలిడ్ ట్యూమర్లను చికిత్స చేయడం కోసం రేడియేషన్, కీమోథెరపీల మీదే ఆధారపడక తప్పదు. యుటెరైన్ కేన్సర్‌లో సర్జరీ, రేడియేషన్ అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే కీమో అవసరమవుతుంది. ఒవేరియన్ కేన్సర్లకు ఎక్కువగా కీమోథెరపీ, సర్జరీ అవసరమవుతాయి. ఇలా ఎవరికి వాళ్లకు వ్యక్తిగత చికిత్సలను వైద్యులు ఎంచుకుంటారు.
చికిత్స తదనంతర మందులు ఇవే!
ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ కేన్సర్ లాంటి వేగంగా వృద్ధి చెందే కేన్సర్లు కీమోథెరపీతో బాగా అదుపులోకి వస్తాయి. అలా కీమోతో కేన్సర్ గడ్డను తగ్గించి, తర్వాత సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇలాంటి కేన్సర్లకు ఎంతటి సమర్థమైన చికిత్స అందించినప్పటికీ తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కేన్సర్లకు టార్గెటెడ్ థెరపీని ఎంచుకోవాలి. ఇలాంటి చికిత్సతో కేన్సర్ తిరగబెట్టే సమయం పెరుగుతుంది. హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు ఐదు నుంచి పది సంవత్సరాల పాటు కొన్ని మందులను వాడుకోవలసి ఉంటుంది. అయితే హెర్‌టు, ట్రిపుల్ నెగటివ్ కోవకు చెందిన రొమ్ము కేన్సర్ రోగులకు ఇలాంటి ముందులతో ఉపయోగం ఉండదు. అయితే కొన్ని కేన్సర్లకు హెల్త్ సప్లిమెంట్లు వాడుకోవలసి ఉంటుంది. పెద్దపేగు కేన్సర్ రోగుల్లో చికిత్స తర్వాత, పాలిప్స్ కేన్సర్ కణాలుగా వృద్ధి చెందకుండా ఉండడం కోసం విటమిన్ సి సప్లిమెంట్లు వాడుకోవాలి. అలాగే ఇంకొంతమందికి విటమిన్ డి3 అవసరమవుతుంది. అలాగే ఓరల్, ఓరల్ ఫారింజియల్ కేన్సర్ల చికిత్సలో ఇచ్చే రేడియేషన్, కీమోథెరపీల వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్లు థైరాయిడ్ సప్లిమెంట్లు వాడుకోక తప్పదు.
చికిత్స తదనంతర జాగ్రత్తలు
కేన్సర్ వ్యాధి ప్రభావానికే వైద్యులు చికిత్సను అందించగలుగుతారు. అంతేతప్ప కేన్సర్ కారకానికి కాదు. ధూమపానంతో ఓరల్ కేన్సర్‌కు గురై కోలుకున్న వాళ్లు, తర్వాత జర్దా తింటే, వాళ్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారుతుంది. కాబట్టి కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత, సదరు కేన్సర్ కారకానికి దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. లేదంటే కేన్సర్ నుంచి కోలుకున్న ఆరు నెలల వ్యవధిలో రెండోసారి కేన్సర్ కసిగా దాడి చేస్తుంది.
ధూమపానం, మద్యపానం జోలికి వెళ్లకూడదు
బరువు పెరగకూడదు
మసాలాలు, రెడ్ మీట్ మానేయాలి.
క్రమం తప్పక వ్యాయామం చేయాలి.
కుటుంబ తోడ్పాటు కీలకం
కేన్సర్ చికిత్స దుష్ప్రభావాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే వాటి తీవ్రతను కొంత తగ్గించుకునే మార్గాలున్నాయి. అందుకోసం పోషకభరిత ఆహారం తీసుకోవాలి. అలాగే కుటుంబ తోడ్పాటు కూడా ఎంతో అవసరం. కేన్సర్ చికిత్సకు ఎంతో డబ్బు ఖర్చవుతోందనీ, వ్యాధి తగ్గుతుందో లేదోననీ కుటుంబసభ్యులూ, బంధువులూ రోగులతో నెగటివ్‌గా మాట్లాడకూడదు. అలాగే వాళ్ల పట్ల జాలిని ప్రదర్శించడం కూడా సరికాదు. ఇలాంటి ధోరణితో రోగులు మానసికంగా కుంగిపోతారు. కాబట్టి కుటుంబ సభ్యులు రోగుల మనోధైర్యాన్ని పెంచేలా నడుచుకోవాలి. అలాగే నేడు కేన్సర్ చికిత్స తాలూకు దుష్ప్రభావాలకు మంచి మందులు అందుబాటులోకొచ్చాయి. వీటితో పరిస్థితి కొంత మెరుగవుతుంది. అలాగే కేన్సర్ రోగులకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఎంతో అవసరం.
కేన్సర్ రాకుండా...
దురలవాట్లు: మద్యపానం, ధూమపానం కేన్సర్ కారకాలు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
వ్యాయామం: వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.
కాలుష్యం: వీలైనంత వరకూ వాతావరణ కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.
కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు ఉపయోగించని ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి.
సేంద్రీయ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి.
తల్లులు పిల్లలకు పాలివ్వడం ద్వారా రొమ్ము కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
హెపటైటిస్ సి, హెచ్‌పివి వ్యాక్సిన్లతో కాలేయ, సర్వైకల్ కేన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.
కుటుంబ చరిత్రలో కేన్సర్ ఉన్నవాళ్లు, జెనెటిక్ టెస్టింగ్‌తో కేన్సర్‌ను ముందుగానే పసిగట్టి, తగు జాగ్రత్తలు పాటించాలి.
-డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు,
ఛైర్మన్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజీ సర్వీసెస్,
రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్,
కార్ఖానా, సికింద్రాబాద్.