Share News

Israel-Hamas War: అది ఇజ్రాయెల్‌కి ఏమాత్రం మంచిది కాదు.. బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా వార్నింగ్

ABN , First Publish Date - 2023-11-08T16:25:56+05:30 IST

హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులు నిర్వహిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. హమాస్‌ని నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్తూ.. అక్కడ బాంబుల వర్షం కురిపించింది. దీంతో.. గాజా మొత్తం శవాలదిబ్బగా మారింది.

Israel-Hamas War: అది ఇజ్రాయెల్‌కి ఏమాత్రం మంచిది కాదు.. బెంజిమన్ నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా వార్నింగ్

America Warns Israel: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులు నిర్వహిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. హమాస్‌ని నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్తూ.. అక్కడ బాంబుల వర్షం కురిపించింది. దీంతో.. గాజా మొత్తం శవాలదిబ్బగా మారింది. సామాన్య పౌరులు మరణిస్తున్నా పట్టించుకోకుండా.. ఇజ్రాయెల్ తన దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. కనీసం సామాన్య ప్రజల్ని రక్షించేందుకు తాత్కాలికంగా అయినా కాల్పులకు విరామం ప్రకటించాలని కోరుతున్నా.. తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది.

ఇలాంటి తరుణంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రత బాధ్యత తమదేనంటూ కుండబద్దలు కొట్టారు. ఈ యుద్ధం ప్రారంభానికి ముందు గాజా ‘హమాస్’ నియంత్రణలో ఉన్నప్పటికీ.. అక్కడి వాయు, జల క్షేత్రాలు తమ అధీనంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు హమాస్ కథ ముగిసిన తరుణంలో.. గాజా బాధ్యతల్ని ఇజ్రాయెల్ తీసుకుంటుందని తెలిపారు. అంటే.. పరోక్షంగా గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు చెప్పకనే చెప్పేశారు. దీనిపై అమెరికా తాజాగా స్పందిస్తూ.. గాజాని ఆక్రమించడం ఇజ్రాయెల్‌కు ఏమాత్రం మంచిది కాదని హెచ్చరికలు జారీ చేసింది.


‘‘ఇజ్రాయెల్ దళాలు గాజాను తిరిగి ఆక్రమించడం అనేది ఇజ్రాయెల్‌కు, ఆ దేశ ప్రజలకు ఏమాత్రం మంచిది కాదని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికీ నమ్ముతున్నారు. యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఏంటి? అక్కడ ఏ ప్రభుత్వం ఉంటుంది? అనే విషయాలపై విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కొన్ని దేశాలతో చర్చించారు. ఎందుకంటే.. యుద్ధానికి ముందు, అంటే అక్టోబరు 6 నాటి పరిస్థితులు గాజాలో మళ్లీ కనిపించకపోవచ్చు. అక్కడ హమాస్ ప్రభుత్వం ఉండకపోవచ్చు’’ అని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బి తెలిపినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది. మరి.. దీనిపై ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

నిజానికి.. 2007 వరకూ ‘గాజా’ ఇజ్రాయెల్ అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది. దీంతో.. హమాస్ ‘గాజా’ను స్వాధీనం చేసుకొని, అక్కడ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో హమాస్ కథ దాదాపు కంచికి చేరింది కాబట్టి, ఏకాకిగా మిగిలే గాజా బాధ్యతలను కనీసం కొంతకాలం పాటు అయినా తీసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇంతలోనే ఇది ఏమాత్రం మంచిది కాదంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక ఆంతర్యం ఏంటి? గాజాపై ఆధిపత్యం చెలాయించాలని అమెరికా భావిస్తోందా?

Updated Date - 2023-11-08T16:25:58+05:30 IST