Joe Biden: జీ20 సదస్సుకు చైనా ప్రెసిడెంట్ రావడం లేదని తెలిసి మస్తు ఫీలైన అమెరికా అధ్యక్షుడు!
ABN, First Publish Date - 2023-09-04T11:29:16+05:30
భారత్‌లో జరిగే జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కావడం లేదని తెలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరుత్సాహానికి గురయ్యారు.
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కావడం లేదని తెలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే జిన్‌పింగ్ ఈ సదస్సుకు హాజరు కాకపోయినప్పటికీ తాను ఆయనను చూడడానికి వెళ్తున్నట్టు బైడెన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం డేలావేర్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది. కానీ నేను ఆయనను చూడటానికి వెళుతున్నాను" అని బైడెన్ చెప్పారు. కాగా సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య భారత్‌లో జీ 20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం బైడెన్ వియత్నాం పర్యటనకు వెళ్తారు. ఈ సందర్భంగా భారత్, వియత్నాం కూడా అమెరికాతో సంబంధాలను బలపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని బైడెన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి మొదట చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుతం ఆయన రాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ జీ20 సమావేశానికి హాజరవుతారని ఈ విషయం తెలిసిన వర్గాలు మీడియాకు తెలిపాయి.
నిజానికి.. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య ఈ జీ20 సదస్సులో ద్వైపాక్షిక చర్చలు జరగొచ్చని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు ఆయన ఈ సదస్సుకి రావడం లేదు కాబట్టి ఆ చర్చలకు అవకాశం లేకుండా పోయింది. అయితే.. జీ జిన్‌పింగ్ ఈ జీ20 సమ్మిట్‌కు హాజరు కాకపోవడానికి గల సరైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అంతకుముందు బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలిసినప్పుడు కూడా వారి మధ్య ద్వైపాక్షిక భేటీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఆ ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారే తప్ప ద్వైపాక్షిక చర్చలు జరపలేదు.
Updated Date - 2023-09-04T11:33:16+05:30 IST