Bharat : దేశం పేరు మార్పుపై అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ట్వీట్స్
ABN , First Publish Date - 2023-09-05T15:12:06+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సానుకూలంగా స్పందించారు.
అమితాబ్ బచ్చన్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత్ మాతా కీ జై అని నినదించారు. దీనికి భారత దేశ జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను జత చేశారు. అమితాబ్ ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. జైహో, జై హింద్-జై భారత్... అంటూ ట్వీట్ చేశారు.
వీరేంద్ర సెహ్వాగ్ స్పందన
క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన ట్వీట్‌లో, పేరు మనకు గర్వకారణంగా నిలిచేదిగా ఉండాలని తాను ఎల్లప్పుడూ విశ్వసిస్తానని తెలిపారు. మనం భారతీయులమని, ఇండియా అనే పేరును బ్రిటిషర్లు పెట్టారని తెలిపారు. మన అసలు పేరు ‘భారత్’ను అధికారికంగా చాలా కాలం క్రితమే తిరిగి తీసుకుని రావలసిందని అన్నారు. ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆడే భారతీయ క్రికెటర్ల జెర్సీలపైన ‘భారత్’ అని ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, జయ్ షాలను కోరుతున్నానని తెలిపారు.
మోదీ మాటల్లో భావం అదేనా?
మోదీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి మాట్లాడుతూ, బానిసత్వానికి సంబంధించిన ప్రతి అంశం నుంచి విముక్తి పొందడం కోసం శపథం చేయాలని పిలుపునిచ్చారు. దీని భావం దేశం పేరు మార్చడమేనా? అని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే..
జీ20 దేశాధినేతల సదస్సు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. ఈ ఏడాది జీ20 దేశాల కూటమికి భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జీ20 దేశాధినేతలకు ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారు. ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారు. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారు, కానీ ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. దీంతో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ