బాహుబలి క్రాష్ బ్యారియర్!
ABN , First Publish Date - 2023-03-05T01:16:15+05:30 IST
కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వశాఖ కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉక్కుకు బదులుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంక బొంగులతో(వెదురు) రోడ్డు ‘క్రాష్ బ్యారియర్’

కంక బొంగులతో తయారీ.. ప్రపంచంలోనే తొలిసారి
నాగ్‌పూర్, మార్చి 4: కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వశాఖ కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉక్కుకు బదులుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంక బొంగులతో(వెదురు) రోడ్డు ‘క్రాష్ బ్యారియర్’ను(మూలమలుపుల దగ్గర రక్షణగా ఏర్పాటు చేసే గోడ) తయారు చేసింది. మహారాష్ట్రలోని వణీ-వరోరా హైవేపై 200 మీటర్ల పొడవున ఈ వెదురు క్రాష్ బ్యారియర్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం వెల్లడించారు. ‘‘వెదురు క్రాష్ బ్యారియర్లు ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయమే కాక పర్యావరణహితమైనవి, పునర్వినియోగానికి ఎంతో అనుకూలమైనవి’’ అని గడ్కరీ ట్వీట్ చేశారు. వణీ-వరోరా హైవేపై ఏర్పాటు చేసిన క్రాష్ బ్యారియర్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. వెదురులోని బాంబూసా బాల్కోవా రకం నుంచి కర్రలను తీసుకొని, వాటిని క్రియోసోట్ నూనెతో శుద్ధి చేసి, హై డెన్సిటీ పాలీ ఇథిలీన్(హెచ్‌డీపీఈ)తో పూత పూసి ఈ క్రాష్ బ్యారియర్‌ను తయారు చేశారు. ఎన్నో పరీక్షలు నిర్వహించి, సమర్థమంతమైనది అని తేలిన తర్వాతే వెదురు క్రాష్ బ్యారియర్‌ను హైవేపై ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు.