Opposition Unity : శరద్ పవార్ నేతృత్వంలో ఎన్డీయేపై పోరు.. అంత కన్నా సంతోషం ఏముంటుందన్న నితీశ్ కుమార్..
ABN, First Publish Date - 2023-05-11T21:40:42+05:30
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం
ముంబై : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar chief minister Nitish Kumar) రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik)తో భేటీ అయిన నితీశ్ గురువారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (NCP president Sharad Pawar)తో ముంబైలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
నితీశ్ కుమార్ మాట్లాడుతూ, విస్తృత స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరిన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తాయన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కలిసిరావడం అవసరమని చెప్పారు. పవార్ ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తారా? అని ప్రశ్నించినపుడు నితీశ్ స్పందిస్తూ, ‘‘అంతకన్నా సంతోషకరమైనది మరొకటి ఉండదు. కేవలం ఎన్‌సీపీ కోసం మాత్రమే కాకుండా యావత్తు దేశం కోసం మరింత ఉత్సాహంగా పని చేయాలని ఆయనకు చెప్పాను’’ అని తెలిపారు. నేడు బీజేపీ చేస్తున్నది దేశ ప్రయోజనాల కోసం కాదన్నారు. ఇటువంటి పరిస్థితిలో మరిన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే, కలిసివస్తే, దేశానికి మేలు జరుగుతుందన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఐక్యత, కలయిక జరుగుతోందని చెప్పగలనని తెలిపారు.
శరద్ పవార్ మాట్లాడుతూ, ఈ చర్చలన్నీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA)లో భాగంగానే జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కలిసికట్టుగా పని చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. దేశ పరిస్థితిని చూసినపుడు, మనం కలిసికట్టుగా పని చేస్తే, (ఎన్డీయేకు) ప్రత్యామ్నాయానికి మద్దతు దొరుకుతుందని చెప్పారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్నారు. కర్ణాటక ప్రజలు లౌకికవాద ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు.
ఈ సమావేశం దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో జరిగింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టపరచడం కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. నితీశ్ కుమార్ గురువారం ఉదయం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేతో కూడా సమావేశమయ్యారు. ముంబైలోని ఉద్ధవ్ నివాసం ‘మాతోశ్రీ’లో ఈ సమావేశం జరిగింది.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..
Updated Date - 2023-05-11T21:40:42+05:30 IST