Congress : జైరామ్ రమేశ్ చైనా పెంపుడు కుక్క : మహేశ్ జెఠ్మలానీ
ABN, First Publish Date - 2023-01-24T20:27:33+05:30
కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) చైనా పెంపుడు కుక్క అని బీజేపీ ఎంపీ, న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) చైనా పెంపుడు కుక్క అని బీజేపీ ఎంపీ, న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు. నిషేధానికి గురైన చైనీస్ టెలికాం కంపెనీల తరపున ఆయన 2005 నుంచి లాబీయింగ్ చేస్తున్నారన్నారు. చైనీయులు ఆయనను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. సున్నితమైన సరిహద్దు సమస్యలపై భారత దేశ వైఖరిని ఆయన సవాల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్ జెఠ్మలానీ (Mahesh Jethmalani) మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, జైరామ్ రమేశ్ చైనా పెంపుడు కుక్క అనే విషయం సుస్పష్టమని తెలిపారు. చైనీయులు ఆయనను పొగుడుతూ, ఆయన చెప్పినదానికి అంగీకరించాలని భారత ప్రభుత్వానికి చెప్తున్నట్లు కనిపించే లింక్‌ను తాను షేర్ చేశానని చెప్పారు. కలవరానికి గురైన భారతీయుడిగా తనకు చాలా ఆందోళనగా ఉందన్నారు. సున్నితమైన సరిహద్దు సమస్యలపై భారత దేశ వైఖరిని జైరామ్ సవాల్ చేస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ వ్యతిరేక, చైనాకు అనుకూల వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. భారత దేశం కోసం నిజాయితీగా మాట్లాడుతున్నారా? ప్రేరేపిత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా? అని నిలదీశారు.
అంతకుముందు జెఠ్మలానీ ఇచ్చిన ట్వీట్‌లో, చైనాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని జైరామ్ రమేశ్ ప్రశ్నించడమే ఆయనకుగల హువావేయి (Huawei) లింక్స్‌ను వెల్లడించే అర్హతను తనకు ఇచ్చిందని పేర్కొన్నారు. 2005 నుంచి జైరామ్ భారత దేశంలో చైనీస్ టెలికాం కంపెనీ హువావేయి కార్యకలాపాల కోసం లాబీయింగ్ చేశారన్నారు. దీనికి ఆధారం జైరామ్ రాసిన పుస్తకంలో ఉందని తెలిపారు. ఆ పుస్తకంలోని ఓ భాగాన్ని పోస్ట్ చేశారు. భద్రతాపరమైన ముప్పు కారణంగా అనేక దేశాల్లో హువావేయి కార్యకలాపాలపై నిషేధం అమలవుతోందన్నారు. ఇప్పుడు జైరామ్ చైనాపై భారత ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారన్నారు.
జెఠ్మలానీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర వెనుక చాలా ఉందన్నారు. ఈ యాత్రకు ఆయన నాయకత్వం వహిస్తున్నారని, అనేక ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పవలసి ఉందని తెలిపారు. 2005 నుంచి హువావేయి తరపున ఆయన లాబీయింగ్ చేస్తున్నారని, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ కంపెనీ భారత దేశంలో ప్రవేశించడంపై భద్రతాపరమైన కారణాలను చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. కానీ ఆయన మాత్రం ఈ అభ్యంతరాలను ఎగతాళి చేశారన్నారు. అప్పటి నుంచి ఆయనకు చైనాతోనూ, చైనా కంపెనీలతోనూ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్-చైనా సంబంధాలపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరు దేశాల మధ్య కాకుండా, రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అని కొందరు విమర్శించారు.
Updated Date - 2023-01-24T20:31:28+05:30 IST