Modi-BBC Documentrary Row: బీబీసీకి అండగా ఉంటామని ప్రకటించిన బ్రిటన్
ABN , First Publish Date - 2023-02-22T20:09:45+05:30 IST
బీబీసీకి అండగా ఉంటామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) రూపొందించిన ‘India: The Modi Question’ డాక్యుమెంటరీ ప్రకంపనలు భారత్‌లో కొనసాగుతుండగా బ్రిటన్ పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగింది. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు బీబీసీకి అండగా ఉంటామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (Modi-BBC Documentrary Row), తదనంతర పరిణామాలపై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ కూలంకషంగా చర్చించింది. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు బీబీసీకి ఆర్ధికంగా కూడా మద్దతుగా ఉంటామని ఫారెన్, కామన్‌వెల్త్ అండ్ డవలప్‌మెంట్ ఆఫీస్ బ్రిటన్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీ మినిస్టర్ డేవిడ్ రౌట్లీ ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. బీబీసీ ఆదాయ వివరాల్లో పారదర్శకత లేదని సీబీడీటీ అధికారులు తేల్చారు. బీబీసీ అవకతవకలకు పాల్పడిందని, పన్ను ఎగవేతకు పాల్పడిందని సీబీడీటీ అధికారులు స్పష్టం చేశారు. బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల నుంచి కీలక పత్రాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీబీడీటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్‌లో బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం, సర్వే పేరిట బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
Lok sabha Elections 2024: మోదీని ఆపతరమా?
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 2002లో గుజరాత్‌లో జరిగిన హింసాకాండపై ‘India: The Modi Question’ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని భారత దేశంలో అధికారికంగా ప్రసారం చేయలేదు. గుజరాత్ అల్లర్లు, మోదీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయవద్దని జనవరి 21న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. యూట్యూబ్, ట్విటర్ల నుంచి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులు, వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీ నిష్పక్షపాతంగా లేదని పేర్కొంది. వలసవాద ఆలోచనా ధోరణి కనిపించిందని పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ (BBC) కార్యకలాపాలను భారత దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తోసిపుచ్చింది. పూర్తిగా తప్పుడు అవగాహనతో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని పేర్కొంది. హిందు సేన చీఫ్ విష్ణు గుప్త (Vishnu Gupta) ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మోదీపై రెండు భాగాలుగల డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
బీబీసీ ఈ డాక్యుమెంటరీలో భారత దేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని విష్ణు గుప్త తన పిటిషన్‌లో ఆరోపించారు. అంతర్జాతీయంగా ఎదుగుతున్న భారత దేశానికి, మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఫలితమే ఈ డాక్యుమెంటరీ అని పేర్కొన్నారు. మోదీ, భారత్ ఎదుగుదలను భారత దేశ వ్యతిరేక లాబీ, మీడియా, మరీ ముఖ్యంగా బీబీసీ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించడం సహా ఇతర అంశాలు ప్రత్యేకమైనవని తెలిపింది.
పిటిషనర్ తరపున న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పూర్తిగా తప్పుడు అవగాహనతో కూడుకున్నదని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించడంతో పింకీ మాట్లాడుతూ, దయచేసి ఈ డాక్యుమెంటరీ వెనుకగల నేపథ్యాన్ని గమనించాలని కోరారు. బ్రిటన్‌కు ప్రధాన మంత్రిగా ఓ భారతీయుడు రుషి సునాక్ (Rishi Sunak) ఉన్నారని, భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. దీనిపై జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ, ‘‘ఈ వాదన ఎలా సాధ్యమవుతుంది? మీరు పూర్తి సెన్సార్‌షిప్ విధించాలని కోరుకుంటున్నారా? ఏమిటిది?’’ అన్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, పాత్రికేయుడు ఎన్ రామ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌తో కూడిన ట్వీట్లను తొలగించాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్‌లో జరుగుతుందని తెలిపింది.
బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) స్పందించారు. డాక్యుమెంటరీ యాదృశ్చికంగా చేసింది కాదని, రాజకీయ కారణాలతోనే చేశారని ఘాటుగా విమర్శించారు. రాజకీయాలు విదేశాల నుంచి కూడా జరుగుతాయని, రాజకీయాల్లో తలపడలేని కొందరు మీడియా ముసుగులో ఇలాంటి పనులు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలు ఇలాంటి వీడియోలను నమ్మబోరని, ప్రజాతీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతోందని జై శంకర్ స్పష్టం చేశారు.