Chief Minister: ఇక తగ్గేదేలే.. గవర్నర్‌తో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయం

ABN , First Publish Date - 2023-07-01T07:57:24+05:30 IST

మంత్రి సెంథిల్‌బాలాజి వ్యవహారంలో తొందరపాటు ప్రదర్శిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి అడ్డుకట్ట వేయాలని ము

Chief Minister: ఇక తగ్గేదేలే.. గవర్నర్‌తో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయం

- న్యాయ నిపుణులతో సీఎం భేటీ

- గంటకు పైగా సమావేశం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మంత్రి సెంథిల్‌బాలాజి వ్యవహారంలో తొందరపాటు ప్రదర్శిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)కి అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో న్యాయనిపుణులతో గంటకు పైగా భేటీ అయ్యారు. అడ్వకెట్‌ జనరల్‌ షణ్ముగసుందరం(Advocate General Shanmugasundaram), సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌ఆర్‌ ఇళంగో, పి.విల్సన్‌, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మూర్తి, పలువురు ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రి డిస్మిస్‌ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించినప్పటికీ... ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదలరాదని, గవర్నర్‌పై తాడేపేడో తేల్చుకుందామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఏమేం చేయగలమో అధ్యయనం చేసి, సరైన ప్రణాళికతో రావాలని న్యాయ నిపుణులను ఆదేశించినట్లు సమాచారం.

గవర్నర్‌కు ఆ అధికారం లేదు: మంత్రి తంగం తెన్నరసు

ముఖ్యమంత్రితో సంప్రదించకుండా మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని మంత్రి తంగం తెన్నరసు(Minister Thangam Tennarasu) స్పష్టం చేశారు. గవర్నర్‌ అనుసరిస్తున్న దుందుడుకు చర్యలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు డీఎంకే ప్రభుత్వం వెనుకాడబోదని పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం న్యాయశాఖ మంత్రి మూర్తి, డీఎంకే ఎంపీ, సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన న్యాయనిపుణుల సమావేశంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సెంథిల్‌బాలాజిపై నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం అడ్డుపడటం లేదని, చట్టప్రకారం ఆ కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రి వద్ద విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు తెలపడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌... మంత్రి సెంథిల్‌బాలాజిని టార్గెట్‌గా చేసుకుని అదేపనిగా ఆరోపణలు చేస్తూ డిస్మిస్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏమిటో ఇదివరకే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కేంద్రమంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న పలువురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని, వారిని రాష్ట్రపతి ఎందుకు డిస్మిస్‌ చేయలేదో గవర్నర్‌ తెలుసుకోవాలన్నారు. తనకు లేని అధికారం ఉన్నట్లుగా గవర్నర్‌ భ్రమపడుతూ సెంథిల్‌బాలాజి(Senthilbalaji))ని డిస్మిస్‌ చేసి తీవ్ర భంగపాటుకు గురయ్యారన్నారు. న్యాయవాది విల్సన్‌ మాట్లాడుతూ.. సెంథిల్‌బాలాజిని డిస్మిస్‌ చేయడానికి తనకు గల అధికారాలను ఉటంకిస్తూ తెలియజేసిన చట్టాలేవీ ఆయనకు వర్తించవన్నారు. గవర్నర్‌ రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకంగా డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ విషయాన్ని న్యాయస్థానంలో రుజువు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-01T07:57:24+05:30 IST