CM Siddaramaiah: ఈసారి వైభవంగా మైసూరు దసరా వేడుకలు
ABN , First Publish Date - 2023-08-01T12:27:48+05:30 IST
ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను(Mysore Dussehra Festivals) ఈసారి అర్థవంతంగా వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం
- దసరా ఉత్సవ కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను(Mysore Dussehra Festivals) ఈసారి అర్థవంతంగా వైభవోపేతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరంలో సోమవారం ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Chief Minister Siddaramaiah and Deputy Chief Minister DK Shivakumar), ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వందితాశర్మ పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను ప్రారంభించే ముఖ్యఅతిథిని ఎంపిక చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తూ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అనవసర ఖర్చును తగ్గించి దసరా ఉత్సవాలను ప్రజా సంబరాలుగా జరపాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. అక్టోబరు 15న ఉదయం 10.15 - 10.30 గంలమధ్య శుభలగ్నంలో ప్రారంభించాలని తీర్మానించారు. దివిటీల కవాతు విజయదశమి రోజున జరగనుంది. దేవీ నవరాత్రుల వేళ కన్నడ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా చలనచిత్రోత్సవం, రైతు దసరా, యువ దసరాను కూడా నిర్వహించనున్నారు. రాచనగరి మైసూరులోని అన్ని చారిత్రాత్మక కట్టడాలను ఉత్సవాలు జరిగే ప్రాంతాలను విద్యుద్దీపాలతో రమ ణీయంగా అలంకరిస్తారు. దసరా ముగిసిన తర్వాత కూడా వారం పాటు వీటిని పర్యాటకులు తిలకించేలా కొనసాగించనున్నారు.
ఐదు గ్యారెంటీ శకటాలు
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శక్తి, గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి పథకాల విశిష్టతను ప్రతిబింబించేలా ఐదు శకటాలను రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. తద్వారా ఈ పథకాలపై ప్రజలపై అవగాహన పెంచాలన్నారు. దసరా వేడుకల ప్రారం భోత్సవం రోజే వస్తు ప్రదర్శనను కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. వస్తు ప్రదర్శనలో ఈసారి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వామ్యం చేయ దలిచారు. సాంస్కృతిక వేడుకల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రత్యేకించి యువ దసరా కళాశాల విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా ఉండాలన్నారు. నాడ హబ్బ దసరా పర్యాటక రంగానికి ఊత మిచ్చేలా చూడాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్దసంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రత్యేక ఎయిర్ షో
దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఎయిర్ షో ప్రధాన ఆకర్షణ కానుంది. రక్షణ మంత్రి త్వశాఖ మంత్రితో ఈ అంశంపై చర్చిస్తున్నామని సీఎం సభకు తెలిపారు. మైసూరుతోపాటు శ్రీరంగపట్టణ, చామరాజనగర(Srirangapatna, Chamarajanagara)లలో కూడా ఏక కాలంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా మైసూరు దసరా వేడుక లను ఈసారి వైభవోపేతంగా జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకయ్యే ఖర్చుతో అంచనా ప్రతిపాదనలు పంపాలని మైసూరు దసరా వేడుకల కార్యవర్గ సమితికి సూచించింది. సమావేశంలో మంత్రులు డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప, శివరాజ్ తంగడగి, హెచ్‌కే పాటిల్, బైరతి సురేశ్, వెంకటేశ్, మైసూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తన్వీర్ సేట్, జీటీ దేవేగౌడతోపాటు మైసూరు జిల్లా అధికారి డాక్టర్ కేవీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.