Congress: ట్రబుల్ షూటర్ కోసం... బెంగళూరుకు క్యూ కడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ABN, First Publish Date - 2023-08-13T11:02:17+05:30
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన కేపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి
- తెలంగాణలో విజయం కోసం డీకే శివకుమర్కు కీలక బాధ్యతలు..!
- అధిష్టానం వ్యూహం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన కేపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)కు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ పలు కీలక సందర్భాల్లో ఉపయోగించుకుంటూ వస్తోంది. అదే రీతిలోనే త్వరలో రానున్న తెలంగాణ(Telangana) శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం డీకే శివకుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం కొనసాగగా... కేంద్రం, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వాల (డబుల్ ఇంజన్) ద్వారా మరింత ప్రగతి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులు రాష్ట్రంలో తిష్ట వేసుకుని ప్రచారం చేసినా డీకే శివకుమార్ వ్యూహాలతో తల్లడిల్లిన కమలం చిత్తుగా ఓడిపోయింది. దక్షిణభారత్‌లో కాంగ్రెస్, బీజేపీకి అనుకూలం కల్గిన ఏకైక రాష్ట్రం కర్ణాటక(Karnataka)నే. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని కదిలించే పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలకు సాధ్యం కాలేదని పలు ఎన్నికలు రుజువు చేశాయి. మరో తొమ్మిది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కర్ణాటక(Karnataka) ఎన్నికలు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు కొత్త శక్తిని ఇచ్చాయి. ఇక్కడి ఓటమితో బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు గ్యారెంటీ పథకాలే ప్రధాన కారణం. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి డీకే ఏడాదికిపైగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
బీజేపీ ప్రభుత్వాన్ని అనుక్షణం ఎండగట్టేలా పోరాటాలు చేశారు. బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాలకు అత్యవసరమైన మేకెదాటు ప్రాజెక్టు కోసం ‘నమ్మ నీరు - నమ్మ పోరాట’ పేరిట పాదయాత్ర చేశారు. ఇదే తరుణంలోనే రాహుల్‌గాంధీ(Rahul Gandhi) భారత్‌జోడో యాత్ర సాగింది. దేశవ్యాప్తంగా జోడో యాత్ర రాష్ట్రంలో జరిగిన విధంగా ఎక్కడా కొనసాగలేదనేలా నిర్వహించారు. తర్వాత ప్రభుత్వంపై పే సీఎం ప్రచారం, 40 శాతం కమీషన్ అంశాలు ప్రజల్లోకి దూసుకుపోయాయి. రాజకీయ వ్యూహకర్త సునిల్ కనుగోలు ద్వారా అన్ని వర్గాలను ఆకట్టుకునే పథకాలకు గ్యారెంటీ పేరిట నమ్మకం చూపారు. మహిళలకు ఉచితంగా ప్రయాణించే శక్తి గ్యారెంటీ, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చే అన్నభాగ్య, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి, ప్రతి గృహిణికి నెలకు రూ.2వేలు ఇచ్చే గృహలక్ష్మి, నిరుద్యోగ విద్యార్థులకు యువనిధి గ్యారెంటీని హామీ ఇచ్చారు. వీటన్నింటికీ రూపకర్త డీకే శివకుమార్ అనేది అధిష్టానం గుర్తించింది. ఇప్పటికే తెలంగాణలోనూ సునిల్ కనుగోలుకు పనిచేసిన అనుభవం ఉంది. దీంతో తెలంగాణ ఎన్నికల బాధ్యతలను కూడా అతడికే అప్పగించారని తెలుస్తోంది. దక్షిణాదిన కాంగ్రెస్‌కు కర్ణాటక తర్వాత కొంత మెరుగైన కేడర్ కలిగింది తెలంగాణలోనే. ఈ ఏడాది చివరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. కర్ణాటకకు పొరుగున ఉండే తెలంగాణ ఎన్నికల బాధ్యతను డీకే శివకుమార్‌కు అప్పగించాలనే అంశం రెండు నెలలుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరంతరం బెంగళూరుకు క్యూ కడుతున్నారు. డీకే శివకుమార్‌తో వారు చర్చలు సాగిస్తున్నారు. ఆయన కూడా తరచూ హైదరాబాద్ వెళ్లడం ప్రత్యేకతను సంతరించుకుంది.
Updated Date - 2023-08-13T11:02:18+05:30 IST