Draupadi Murmu: ప్రపంచం చూపు మనవైపు
ABN , First Publish Date - 2023-02-01T02:45:51+05:30 IST
వచ్చే పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు భారత్ ఆవిర్భవించే దిశగా మోదీ ప్రభుత్వ ఆలోచనావిధానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో ఆవిష్కరించారు.
వారసత్వం, వికాసం.. ‘అమృత కాలం’ లక్ష్యాలివే
దేశంలో ఇప్పుడు నిర్ణయాత్మక ప్రభుత్వం
తిరుగులేని సైనిక శక్తిగా ఆవిర్భావం
విశ్వ సమస్యల పరిష్కారంలో మన ముద్ర
అవినీతిపై ఉక్కుపాదం: రాష్ట్రపతి ముర్ము
పార్లమెంటులో తొలిసారి ప్రసంగం
న్యూఢిల్లీ, జనవరి 31: వచ్చే పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు భారత్ ఆవిర్భవించే దిశగా మోదీ ప్రభుత్వ ఆలోచనావిధానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో ఆవిష్కరించారు. దేశంలో ఇప్పుడు సుస్థిర, నిర్భీతి, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందన్నారు. వారసత్వం (విరాసత్), వికాసం అనేవే సర్కారు లక్ష్యాలుగా ప్రకటించారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ దినాన ఉభయసభలనుద్దేశించి తొలిసారి ఆమె ప్రసంగించారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ విజయాలను, జరిగిన అభివృద్ధిని విశదీకరించారు. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే పాతికేళ్లను ‘అమృతకాలం’గా పేర్కొంటూ కేంద్రం పలు పథకాలు, కార్యక్రమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిని ప్రస్తావిస్తూ.. ఈ అమృతకాలంలో నవభారత నిర్మాణానికి ప్రజలంతా తమ వంతు విధి నిర్వర్తించాలని రాష్ట్రపతి పిలుపిచ్చారు.
భారత్ తిరుగులేని సైనిక శక్తిగా రూపొందుతోందని తెలిపారు. పాకిస్థాన్, చైనాల పేరెత్తకుండా.. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) నుంచి వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) దాకా ఎవరు దుస్సాహసాలకు దిగినా గుణపాఠం నేర్పుతున్నామని స్పష్టం చేశారు. 2047నాటికి స్వావలంబన దేశంగా నిలవాలన్నారు. అప్పటికి పేదరికం అనేదే ఉండకూడదని.. మధ్యతరగతి మరింత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గంటకుపైగా సాగిన ప్రసంగంలో ప్రభుత్వ సాంస్కృతిక, ప్రగతిశీలక, పేదల అనుకూల ఎజెండాను విశదీకరించారు. రాష్ట్రపతి ప్రసంగం ఆమె మాటల్లోనే క్లుప్తంగా..
విధాన పక్షవాతం లేదు..
గతంలో ఉన్న ‘విధానపరమైన పక్షవాతం’ ఇప్పుడు లేదు. సత్వర అభివృద్ధి, దూరదృష్టి నిర్ణయాలు తీసుకునే దేశంగా భారత్‌కు ఇప్పుడు గుర్తింపు లభిస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతి శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. భారత్ పట్ల ప్రపంచం కూడా తన దృక్కోణం మార్చుకుంది. గతంలో మన సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రపంచ సమస్యల పరిష్కారానికి మనం కృషిచేస్తున్నాం. మనదైన ముద్ర వేస్తున్నాం. భారత్ రాజకీయంగా, వ్యూహాత్మకంగా శక్తిమంతంగా ఉంటేనే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నాం. ఈ దిశగానే సైన్యం ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. త్రివిధ దళాలను యువరక్తంతో నింపాలి. యుద్ధప్రక్రియల్లో లాఘవం, నేర్పు పెంపొందాలి. ఇదే సమయంలో టెక్నాలజీకి పెద్దపీట వేయాలి. ఈ దిశగానే అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చాం. మేకిన్ ఇండియా కారణంగా రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి.
ప్రపంచం చూపు మనవైపు..
ఉగ్రవాదం భారత కఠిన, దృఢవైఖరిని ప్రపంచం ప్రశంసిస్తోంది. భిన్న ధ్రువాలుగా చీలిపోయిన ప్రపంచాన్ని అనుసంధానించే దేశంగా ఆవిర్భవించింది. జి-20 కూటమి సారథ్యం, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు అధ్యక్షత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిసుస్థిరతల దిశగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్‌లో కీలక భూమిక.. మన ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. ఆర్థిక మాంద్యం, కరోనా, ఉక్రెయిన్ సంక్షోభాల నడుమ ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలు సజావుగా సాగే క్రమంలో విశ్వసనీయ దేశంగా నిలిచింది అని ముర్ము తన ప్రసంగంలో వివరించారు.
శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన కాంగ్రెస్ ఎంపీలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు వివిధ పార్టీల ఎంపీల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. భారత్ జోడో యాత్ర ముగింపు సభ కోసం జమ్మూకశ్మీర్ వెళ్లిన కాంగ్రెస్ ఎంపీలు తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించక శ్రీనగర్‌లో చిక్కుకుపోవడంతో రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేకపోయారు. మొదటి వరుసలో తనకు సీటు కేటాయించిన బెంచీలో ఒంటరిగా కూర్చున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వద్దకు వివిధ పార్టీల ఎంపీలు వచ్చి పలకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా సోనియాను పలకరించడం గమనార్హం. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పలుమార్లు సోనియాతో ముచ్చటించారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌తో సోనియా సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషణ సందర్భంగా డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, అన్నాడీఎంకే ఎంపీ ఎం.తంబిదురై చిరునవ్వులు చిందిస్తూ, ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్నారు. లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశవాన్‌ను.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రధాని మోదీ పలుకరించారు.
మేము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే
ప్రసంగాన్ని బహిష్కరించాం: కేకే, నామా
తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకం కాదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎంపీ కె. కేశవరావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి కేకే విలేకరులతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. సామాజిక, గిరిజన, మహిళా అంశాలపై చాలా గొప్పగా మాట్లాడారు కానీ.. పాలనలో అవి ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రసంగంలో నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణలో గవర్నర్ వ్యవహారంపై స్పందిస్తూ.. బడ్జెట్ ఆమోదం కోసం కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలనే తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని కేకే చెప్పారు. బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరావు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అఖిలపక్ష సమావేశంలో చెప్పాం కానీ.. రాష్ట్రపతి ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్, ఆప్ రాష్ట్రపతిని అవమానించాయి: బీజేపీ
భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆ్‌ప)లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగాన్ని బహిష్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి, రాజ్యాంగ అత్యున్నత పదవిని, పార్లమెంట్ మర్యాదను వారు అవమానించారని కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ప్రతిపక్షాలు కొన్ని నిబంధనలు పాటించాలి, కానీ బీజేపీ, ఆప్‌లు మన పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి దిగజార్చయని ఆయన పేర్కొన్నారు. ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని కీర్తించారని, ప్రభుత్వ విధానాల పట్ల నిరసనను తెలియజేసేందుకు ఈ ప్రసంగాన్ని బహిష్కరించామని వారు చెప్పడం ఏ మాత్రం సరైనది కాదని, అది రాష్ట్రపతి ప్రసంగమని ఆయన పేర్కొన్నారు. ప్రసంగంలో ప్రభుత్వం గురించిన విషయాల పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉండే చర్చల సమయంలో వాటిని లేవనెత్తితే ప్రభుత్వం సమాధానమిచ్చేదని అన్నారు.
కొత్తగా ఏమీ లేదు: ఖర్గే
రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. హిమపాతానికి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోవడం వల్ల రాష్ట్రపతి ప్రసంగం వినేందుకు తాను హాజరు కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం చెప్పించిందన్నారు. అదే నిజమైతే.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పేదలు ఎందుకు కష్టాలు పడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. కొత్త కాలేజీలు, స్కూళ్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అవన్నీ ప్రైవేటు విద్యాసంస్థలేనని, వాటితో పేదలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు.