Hindutva: అయోధ్యలో శిండే, ఫడ్నవీస్.. కీలక పర్యటన
ABN, First Publish Date - 2023-04-09T15:56:52+05:30
అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే స్వప్నం నెరవేరుతోందని చెప్పారు.
అయోధ్య: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అయోధ్యలో రామ మందిరాన్ని (Shri Ram Janmabhoomi Mandir, Ayodhya) సందర్శించారు. రామ్‌లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఇద్దరు నేతలూ మరికొందరు శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా అయోధ్య రామజన్మభూమి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రామాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామ్‌లల్లాకు పూజల అనంతరం శిండే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే స్వప్నం నెరవేరుతోందని చెప్పారు. హెలికాఫ్టర్ నుంచి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న వీడియోను ఫడ్నవీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాస్తవానికి శిండేతో పాటు ఫడ్నవీస్ కూడా అయోధ్య సందర్శిస్తారని ఎవ్వరికీ తెలియదు. ఫడ్నవీస్ లక్నో వచ్చి అక్కడనుంచి అయోధ్య చేరుకుని శిండేతో కలిసి మందిరాన్ని సందర్శించారు.
వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామాలయం వివాదం సమసిసోయి ప్రస్తుతం ఆలయ నిర్మాణం జోరుగా సాగుతోంది. 2024 జనవరి నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో మందిరం అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా భక్తులనుంచి 18 వందల కోట్ల విరాళాలు సేకరించి భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi), యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి(Yogi) రామాలయం నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. భవ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసి తమ నిబద్ధతను చాటుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు.
ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయాక శివసేన పార్టీ పేరును, గుర్తును కైవసం చేసుకున్న శిండే హిందుత్వ విషయంలో దూకుడుగానే ఉన్నారు. తద్వారా హిందుత్వ అంశంలో ఉద్ధవ్ కన్నా తాము ఎక్కడా తగ్గలేదనే సంకేతాలు పంపుతున్నారు. శివసేనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు, పార్టీ వ్యవస్థాపకుడైన బాల్‌థాకరే అడుగుజాడల్లోనే నడుస్తున్నామని చెప్పుకునేందుకు శిండేకు తాజా అయోధ్య పర్యటన ఉపయోగపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
మరోవైపు శిండే, ఫడ్నవీస్ ఇప్పటికే 'సావర్కర్ గౌరవ్ యాత్ర' (Savarkar Gaurav Yatra)ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ, శివసేన కార్యకర్తలు, ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు. దేశానికి సావర్కర్ అందించిన సేవలను స్మరించుకునేందుకు రాష్ట్రంలో 'సావర్కర్ గౌరవ్ యాత్ర'ను చేపట్టినట్లు షిండే సారథ్యంలోని శివసేన గత మార్చిలో ప్రకటించింది. సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన సర్కార్ ఈ యాత్రను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సావర్కర్ జయంతి సందర్భంగా మే 21 నుంచి 28 వరకూ 'వీర్‌భూమి పరిక్రమ' చేపడ్తామని కూడా శిండే ప్రకటించారు. సావర్కర్ జన్మస్థలమైన నాసిక్‌లోని భాగూర్‌లో థీమ్ పార్క్, మ్యూజియం ఏర్పాటు చేస్తారు.
2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన-బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ థాకరే తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. గత ఏడాది జూన్‌లో మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) జట్టులో చేరిపోయారు. సీఎం పదవి కోల్పోవడంతో పాటు ఉద్ధవ్ ఒంటరివారైపోయారు. ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచీ బీజేపీ-శివసేన శిండే వర్గాన్ని ఉద్ధవ్ టార్గెట్ చేస్తూ వచ్చారు. వీధి పోరాటాలకూ దిగారు. దీంతో బీజేపీ-శివసేన శిండే-శివసేన ఉద్ధవ్ వర్గాల మధ్య పూర్తిగా చెడింది.
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఉద్ధవ్ సేన కన్నా తమదే అసలైన శివసేన అని, హిందుత్వానికి తామే అసలైన ప్రతినిధులమని శిండే ప్రకటించుకుంటున్నారు. ఎక్కువ సీట్లు వచ్చి అతి పెద్ద పార్టీగా నిలిచినా శిండేకు తోడుగా నిలబడటం ద్వారా తమది విజయవంతమైన జట్టు అని చెప్పకనే చెబుతున్నారు.
Updated Date - 2023-04-09T16:12:00+05:30 IST