Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యతకు ఫరూక్ అబ్దుల్లా పిలుపు

ABN , First Publish Date - 2023-04-08T20:46:36+05:30 IST

విపక్షాల ఐక్య కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా..

Lok Sabha Elections 2024: విపక్షాల ఐక్యతకు ఫరూక్ అబ్దుల్లా పిలుపు

అనంతనాగ్: విపక్షాల ఐక్య కూటమికి (Opposition Unity) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, శ్రీనగర్ లోక్‌సభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, జాతీయ స్థాయిలో ఐక్య కూటమి దిశగా సత్ఫలితాలు వస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని లార్నూలో శనివారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఐక్య కూటమి మాత్రమే అందర్నీ కలిసికట్టుగా ఉంచగలదని అన్నారు.

"విపక్షాలు ఒంటరిగా పోరాడలేవు. కనీసం జాతీయ స్థాయిలో ఉన్న విపక్ష పార్టీలైనా ముందుకు వచ్చి అందర్నీ కలిసికట్టుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు మార్గాలు అన్వేషించాలి. తద్వారా మనం ఎన్నికల్లో గెలుస్తాం'' అని అబ్దుల్లా అన్నారు.

మొఘల్ పాలకులకు సంబంధించిన కొన్ని అంశాలను పాఠ్యాంశాల నుంచి తొలగించే అంశంపై అడిగినప్పుడు, చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. ''షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్, బాబర్, హుమయూన్, జహంగీర్‌లను ఎవరైనా ఎలా విస్మరించగలరు? 800 ఏళ్ల పాటు వాళ్లు పాలించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు ఎవరూ బెదిరింపులకు గురికాలేదు. తాజ్ మహల్‌ను వాళ్లు చూపించినప్పుడు దానిని ఎవరు కట్టారని చెబుతారు? మొఘల్ చక్రవర్తి ఢిల్లీకి వెళ్తే ముందు ఫతేపూర్ సిక్రీ నుంచి వెళ్లాడు. దానికి ఎలా కాదనగలరు? హుమయూన్ సమాధి, రెడ్ ఫోర్ట్‌ను ఎలా మరుగుపరచగలరు?'' అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు.

Updated Date - 2023-04-08T20:46:36+05:30 IST