Ramcharitamanas Row: ఎస్పీ నేతపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2023-01-24T17:26:30+05:30 IST

రామచరితమానస్‌ వివాదం ముదురుతోంది. రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య...

Ramcharitamanas Row: ఎస్పీ నేతపై ఎఫ్ఐఆర్

లక్నో: రామచరితమానస్‌ (Ramacharitamanas Row) వివాదం ముదురుతోంది. రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya)పై మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఐపీసీ సెక్షన్ 295A, 298, 504, 505(2), 153A కింద లక్నోలోని ఐష్‌బాగ్‌ నివాసి శివేంద్ర మిశ్రా ఈ ఫిర్యాదు చేశారు.

రామచరితమానస్‌లోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదకపై పెద్ద సంఖ్యలో ఉన్న ఒక వర్గాన్ని అవమానిస్తోందని, తక్షణం ఆ అభ్యంతరకర భాగాలను నిషేధించాలని మౌర్య గత ఆదివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మతం అనేది మానవ సంక్షేమం, పటిష్టతకు ఉద్దేశించినది. జాతి, వర్ణం, వర్గాన్ని ఉద్దేశించి రామచరితమానస్‌లో పేర్కొన్న కొన్ని పదాలు సమాజంలో అత్యధికంగా ఉన్న ఒక వర్గాన్ని కించపరచేలా ఉన్నాయి. అలాంటప్పుడు నిశ్చయంగా అది ధర్మం కానేరదు. అది అధర్మమే అవుతుంది. ఆయా వర్గాలకు చెందిన లక్షలాది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అందులోని కొన్ని పదాలు ఉన్నాయి. జనాభాలో సగభాగమైన మహిళల మనోభావాలను కూడా రామచరితమానస్‌లోని శ్లోకాలు కించపరచేలా ఉన్నాయి. తులసీదాస్ రామచరితమానస్‌పై చర్చ జరగడమే అమమానకరమని భావిస్తే, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మహిళలను కించపరచడాన్ని ఎందుకు మతపెద్దలు పట్టించుకోవడం లేదు? ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మహిళలు హిందువులు కారా?'' అని మౌర్య ప్రశ్నించారు. రామచరితమానస్‌లో అభ్యంతరక భాగాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

మండిపడిన బీజేపీ

స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మౌర్య అనుచిత వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్‌గోపాల్ యాదవ్, డింపుల్ యాదవ్ సమాధానం ఇవ్వాలని యూపీ బీజేపీ చీప్ భూపేంద్ర సింగ్ చౌదరి డిమాండ్ చేసారు. ''ఎస్‌పీలో పెద్ద నేత అయిపోవాలని స్వామి ప్రసాద్ మౌర్య చాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మేము నేరుగా యాదవ్ కుటుంబాన్నే ప్రశ్నిస్తున్నాం. పార్టీ అభిప్రాయాన్ని మౌర్య చెబుతున్నారా అనేది ఎస్‌పీ తేల్చిచెప్పాలి. మా మతపరమైన కార్యక్రమాలకు విఘాతం కలిగిచేందుకు ఎస్‌పీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచిన మౌర్య తక్షణం క్షమాపణ చెప్పాలి'' అని చౌదరి అన్నారు. తన వ్యాఖ్యలను మౌర్య వెనక్కి తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఆయనపై సమాజ్‌వాది పార్టీ నేరుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-24T17:30:07+05:30 IST