Article 370: సుప్రీం తీర్పు దురదృష్టకరం.. ప్రజలు సంతోషంగా లేరన్న గులాం నబీ ఆజాద్
ABN , First Publish Date - 2023-12-11T13:55:38+05:30 IST
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.
కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370(Article 370) రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court Judgement) తీర్పు వెలువరించిన తరుణంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించింది.
కశ్మీర్ రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2024 సెప్టెంబర్ 30కల్లా ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము-కశ్మీర్ పార్టీలు ఏర్పడ్డాయి. గుప్కార్ అలయన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలు జమ్ము-కాశ్మీర్ రాజకీయ పార్టీలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ ఆర్టికల్ 370 రద్దు కేసు విచారణలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న ఐదుగురు జడ్జిలు 3 రకాలు తీర్పులు వెల్లడించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలోనే భిన్నమైన తీర్పులు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయినపుడు ప్రత్యేక హోదాలేమీ లేవని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం కేవలం రాజ్యాంగ వెసులుబాటుకోసమేనని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టులో లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా విభజించాలనే నిర్ణయాన్ని సమర్థించింది. తీర్పు నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు.