Good New: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పిన సీఎం
ABN , First Publish Date - 2023-05-18T08:10:48+05:30 IST
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రప్రఢుత్వం తీపికబురు చెప్పింది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. వారికి 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఏ పెంపు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, కుటుంబ పింఛన్‌దారులు లబ్ధిపొందుతారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచినప్పుడల్లా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా పెంచడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మార్చిలో కేంద్రప్రభుత్వం తన ఉద్యోగులకు నాలుగు శాతం కరవు భత్యాన్ని పెంచింది. ఆ కరవు భత్యం పెంపు గత జనవరి ఒకటి నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అప్పటివరకూ చెల్లించాల్సిన కరవుభత్యాన్ని జనవరిలో నాలుగు శాతానికి పెంచింది. అంటే కరవుభత్యాన్ని 34 శాతం నుండి 38 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వు వెలువరించారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు రాష్ట్రం నాలుగు శాతం కరవు భత్యాన్ని వచ్చే జూన్‌లోనే అమలు చేస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు భావించారు. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కరవు భత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ పెంచిన కరవు భత్యం ఏప్రిల్ 1నుంచి వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తున్నారని, అందకే వారికి తగిన సదుపాయాలు కల్పిస్తున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు. మునుపటి అన్నాడీఎంకే(AIADMK) అసమర్థపాలన, కరోనా లాక్‌డౌన్ తదితర కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా లేకున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లనుఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వానికి రూ.2,366.82 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది.