Governor: గవర్నర్ సంచలన కామెంట్స్... ఉన్నత విద్యాశాఖకు ఆ అధికారం లేదు..
ABN , First Publish Date - 2023-09-28T07:35:10+05:30 IST
యూనివర్శిటీల వీసీ సెర్చి కమిటీల ఏర్పాటు వ్యవహారం రాజ్‌భవన్‌కు - జార్జికోటకు మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. ఇప్పటికే ‘ఎడ్డెం
- వీసీ సెర్చి కమిటీ వ్యవహారంపై గవర్నర్
పెరంబూర్(చెన్నై): యూనివర్శిటీల వీసీ సెర్చి కమిటీల ఏర్పాటు వ్యవహారం రాజ్‌భవన్‌కు - జార్జికోటకు మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. ఇప్పటికే ‘ఎడ్డెం అంటే తెడ్డెం’ అన్నట్లుగా ఉన్న ఈ రెండు అధికారిక కేంద్రాల మధ్య ఈ వ్యవహారం మరింత వివాదం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. గతానికి భిన్నంగా వీసీ సెర్చి కమిటీల జాబితాను గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఖరారు చేసి ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా స్పందిస్తూ మరో జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు ఉన్నత విద్యాశాఖకు అధికారం లేదని గవర్నర్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. ‘‘మద్రాసు విశ్వవిద్యాలయానికి కొత్త ఉపకులపతిని సిఫారసు చేసేందుకు అనువుగా ఈనెల 6వ తేది రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి ఆర్‌ఎన్ రవి ఓ సెర్చి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలకు వ్యతిరేకంగా మద్రాసు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎంపిక కమిటీలో చోటుచేసుకున్న యూజీసీ సభ్యుడిని తప్పిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఈనెల 13న జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరించడంతో పాటు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ ఆమోదం లేకుండా విశ్వవిద్యాలయ వ్యవహారంలో జోక్యం చేసుకొనే అధికారం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి లేదు. కావున, రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ప్రచురించిన నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.