Governor: మళ్ళీ వివాదం రేపిన గవర్నర్.. మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీ డిస్మిస్
ABN , First Publish Date - 2023-06-30T07:45:26+05:30 IST
రాష్ట్రమంత్రివర్గం నుంచి సెంథిల్‌బాలాజీని డిస్మిస్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) గురువారం సాయం
- ఆ అధికారం ఆయనకు లేదు: సీఎం స్టాలిన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రివర్గం నుంచి సెంథిల్‌బాలాజీని డిస్మిస్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి మరోమారు వివాదానికి తెరలేపారు. అదే సమయంలో గవర్నర్ ఉత్తర్వును చట్ట ప్రకారం ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) నిర్వర్తిస్తున్న రెండు శాఖలను ఇతర మంత్రులకు కేటాయించేందుకు అంగీకరించిన గవర్నర్ ఆయనను శాఖలు లేనిమంత్రిగా కొనసాగించేందుకు అనుమతించలేదు. దీంతో మంత్రుల తొలగింపు, నియామకాలు ముఖ్యమంత్రి నిర్ణయాలమేరకే జరుగుతాయని, ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదని డీఎంకే పాలకులు స్పష్టం చేశారు. సెంథిల్‌బాలాజీని శాఖలు లేని మంత్రిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యలో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి సెంథిల్‌బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులిచ్చారు.
కారణాలివే...
సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయడానికి గల కారణాలను కూడా గవర్నర్ తన ఉత్తర్వులో తెలిపారు. మంత్రి సెంథిల్‌బాలాజీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడ్డారని, పలు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారని, మంత్రి పదవి దుర్వినియోగం చేసి తనపై జరుగుతున్న విచారణను పక్కదోవ పట్టించేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నారని, అంతేకాకు రాష్ట్ర పోలీసులు కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదు చేశారని, మంత్రిగా ఆయన కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పక్కదోవపట్టిస్తారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వు జారీ చేసినట్లు గవర్నర్ రవి(Governor Ravi) పేర్కొన్నారు.
డిస్మిస్ చేసే అధికారం లేదు...
ఇదిలా ఉండగా సెంథిల్‌బాలాజీని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రుల నియామకాలు, తొలగింపులు అన్నీ ముఖ్యమంత్రి నిర్ణయాలు, సిఫా రసుల మేరకే జరగాలని రాజ్యాంగ దర్మాసనం స్పష్టం చేస్తున్నా గవర్నర్ దురుద్దేశపూరితంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోందని, ఈ వివాదాన్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటామని స్టాలిన్ తెలిపారు. ఇక సెంథిల్‌బాలాజీని మంత్రి వర్గం నుంచి గవర్నర్ తొలగించడం చట్ట వ్యతిరేకమంటూ డీఎంకే మిత్రపక్షాల నాయకులు మండిపడ్డారు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ గవర్నర్ చర్యను సమర్థించారు.