Governor: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన గవర్నర్.. వెనక్కి పంపిన పది వర్సిటీల బిల్లులు
ABN , First Publish Date - 2023-11-17T11:12:25+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) మరోమారు షాకిచ్చారు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు
- రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
- సభామోదంతో మళ్ళీ పంపాలని నిర్ణయం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) మరోమారు షాకిచ్చారు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ముసాయిదా చట్ట సవరణ బిల్లుల్ని ప్రభుత్వానికి తిప్పిపంపారు. గవర్నర్‌కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్నితిప్పి పంపడం గమనార్హం. విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తనకున్న విశేషాధికారాలను తగ్గించే దిశగా ప్రభుత్వం పంపిన ముసాయిదా చట్ట సవరణ బిల్లుల్ని గవర్నర్ తిరస్కరించారు. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గవర్నర్ల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక తమకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేయడానికి ముందే గవర్నర్లు తమ పనితీరు మార్చుకోవాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించినప్పుడు కూడా సుప్రీం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 20న సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం కానుండటంతో గవర్నర్ రవి పది బిల్లులను వెనక్కి పంపడం చర్చనీయాంశమైంది.
సీనియర్ మంత్రులతో సీఎం చర్చ
గవర్నర్ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), సీనియర్ మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, పొన్ముడి తదితరులను తన కార్యాలయానికి పిలిపించి వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ తిప్పి పంపిన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను మరోమారు శాసనసభలో ఆమోదించి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈ నెల 18న శాసనసభ ప్రత్యేకసమావేశం జరుగనుందని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. తిరస్కరణకు గురైన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను రెండోమారు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తే వాటిని గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సివుంది. అయితే గతంలో నీట్ వ్యతిరేక బిల్లును రెండోమారు శాసనసభలో ఆమోదించి పంపితే ఆ బిల్లును గవర్నర్ రవి దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను గవర్నర్ తప్పకుండా ఆమోదించి తీరుతారని, నీట్ బిల్లులా వీటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే ఆస్కారమే లేదని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.
గవర్నర్ ఆమోదించాల్సిందే: స్పీకర్ అప్పావు
శాసనసభలో రెండోమారు ముసాయిదా చట్ట సవరణ బిల్లులను ఆమోదిస్తే గవర్నర్ తప్పకుండా వాటిని ఆమోదించాల్సిందేనని స్పీకర్ అప్పావు స్పష్టం చేశారు. తిరువణ్ణామలైలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ... శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతుందని, ఆ సభలో 10 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ముసాయిదా చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టి సభామోదం ప్రకటిస్తుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు ఆమోదించే బిల్లులను గవర్నర్ ఆమోదిస్తారని ఆయన చెప్పారు.
గవర్నర్ తిప్పిపంపిన బిల్లులు..
- మద్రాసు విశ్వవిద్యాలయం ముసాయిదా చట్ట సవరణ బిల్లు
- తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ న్యాయవిశ్వ విద్యాలయం చట్ట సవరణ బిల్లు
- తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ వైద్య విశ్వ విద్యాలయం చట్ట సవరణ బిల్లు
- రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు
- మదర్ థెరిస్సా మహిళా విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు,
- వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు
- తమిళ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు
- రాష్ట్ర వెటర్నరీ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు
- అన్నా విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు
- రాష్ట్రంలో సిద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చేసిన కొత్త చట్టం బిల్లు