Governor: గవర్నర్‌ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-06-06T08:55:07+05:30 IST

రాష్ట్రంలో యువకులకు వారి విద్యార్హతలకు అనువైన ఉపాధి అవకాశాలు సులువుగా లభించే విధంగా విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేయాల్సిన అవసరం

Governor: గవర్నర్‌ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువకులకు వారి విద్యార్హతలకు అనువైన ఉపాధి అవకాశాలు సులువుగా లభించే విధంగా విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) అన్నారు. నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక నగరం ఊటీలో సోమవారం ఉదయం ప్రారంభమైన వీసీల సదస్సులో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. అంతకుముందు రెండు రోజుల సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తమిళతల్లి ప్రార్థన, జాతీయ గీతం, భారతీయార్‌ గీతాలాపన తర్వాత సదస్సు ప్రారంభమైంది. ముందుగా ఒడిశా రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి అంజలి ఘటించారు. అటు పిమ్మట సదస్సుకు హాజరైన వీసీలతో గవర్నర్‌ రవి పావుగంటసేపు యోగక్షేమాలు కనుక్కున్నారు. ఆ తర్వాత ఆయన వేదికపై ప్రసంగిస్తూ... విద్యారంగంలో తమిళనాడు ఇతర రాష్ట్రాలతో పోటీపడే రీతిలో పురోభివృద్ధిని సాధిస్తోందని, అదే సమయంలో కాలానుగుణంగా యువకుల ప్రతిభాపాటవాలకు ప్రాధాన్యం లభించేలా విద్యావిధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యపైనేకాకుండా ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. యువకుల ప్రతిభాపాటవాలకు అనువైన విద్యను అందించకపోవడం వల్ల రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కుంటుపడుతున్నాయని గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానంలో యువకులకు, వారి ప్రతిభాపాటవాలకు తగినట్లుగా విద్యనందించేందుకు పలు చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితులలో యువకులకు వారి ప్రతిభాపాటవాలకు అనువైన ఉపాధి అవకాశాలు లభించడం లేదని, నేటి తరానికి చెందిన యువకులలో అత్యధికులు ఆంగ్లభాషా పరిజ్ఞానంలో వెనుకబడి ఉన్నారని తెలిపారు.

nani4.jpg

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. దీనికి తోడు ఇంజనీరింగ్‌ పట్టభద్రుల కంటే పాలిటెక్నిక్‌, ఐటీఐ చదివిన విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ తారతమ్యాలను సరిచేసే దిశగా విద్యావిధానంలో సంస్కరణలు అవసరమవుతున్నాయని చెప్పారు. ఈ సదస్సులో తమిళ మాధ్యమంలో లభించని పాఠ్యపుస్తకాలు, అనుబంధ పాఠ్యపుస్తకాలు, పరిశోధన ఉపకరణాలను విశ్వవిద్యాలయాల ద్వారా గుర్తించబడి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తమిళమాధ్యమంలో బోధనను ప్రోత్సహించడం, ఆంగ్ల పాఠ్యపుస్తకాలను తమిళంలో అనువదించడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సదస్సులో యూజీసీ చైర్మన్‌ ఎం. జగదీష్ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భారతీయ భాషా సమితి అధ్యక్షుడు సాము కృష్ణశాస్త్రి, లక్నో విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ అలోక్‌కుమార్‌ రాయ్‌, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ నాగేశ్వరరావు, అనువాదిని అనువాద పరికరం వ్యవస్థాపకుడు బుడ్డా చంద్రశేఖర్‌ తదితరులు ప్రసంగించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకుగాను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి శుక్రవారం ఊటీ చేరుకున్నారు. ఊటీ రాజ్‌భవన్‌లో ఈనెల 9వ తేదీవరకు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధ ఆలయాలను కూడా సందర్శించనున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ పర్యటనకుగానుసుమారు 700 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Updated Date - 2023-06-06T08:55:07+05:30 IST