Manipur violence: మణిపూర్‌లో 23 వేల మంది సురక్షిత ప్రాంతాలకు.. నిఘా పెంచిన సైన్యం..

ABN , First Publish Date - 2023-05-07T19:13:46+05:30 IST

గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో మణిపూర్ (Manipur) జనజీవనం అతలాకుతలమైంది. భారత సైన్యం

Manipur violence: మణిపూర్‌లో 23 వేల మంది సురక్షిత ప్రాంతాలకు.. నిఘా పెంచిన సైన్యం..

న్యూఢిల్లీ : గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో మణిపూర్ (Manipur) జనజీవనం అతలాకుతలమైంది. భారత సైన్యం (Indian Army), అస్సాం రైఫిల్స్ (Assam Riffles) సహాయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. సుమారు 23 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సైన్యం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఇక్కడ చదువుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) విద్యార్థినీ, విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఆహారం లేకపోవడంతోపాటు, నీళ్లలో విషం కలిపారనే ప్రచారం వల్ల దాహం తీర్చుకోవడానికి సైతం అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు.

సైన్యం సహాయ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు జరగలేదని స్థానిక మీడియా తెలిపింది. చురాచాంద్‌పూర్‌లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు తెలిపింది. అనంతరం భద్రతా దళాలు కవాతు నిర్వహించాయని తెలిపింది. నాలుగు రోజుల నుంచి సైన్యం, ఆస్సాం రైఫిల్స్ సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని తెలిపింది. అన్ని జాతులకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని వివరించింది. శనివారం నుంచి మణిపూర్‌లో గగనతల నిఘాను పెంచినట్లు సైన్యం తెలిపింది. ఇంఫాల్ లోయలో సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెట్టినట్లు తెలిపింది.

మెయిటీలు మణిపూర్ జనాభాలో సుమారు 53 శాతం మంది ఉన్నారు. వీరిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో గిరిజనులు, ముఖ్యంగా కుకీ తెగవారు తీవ్ర వ్యతిరేకతతో నిరసనకు దిగారు. ఈ ఘర్షణల్లో శనివారం నాటికి 55 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది.

ఇవి కూడా చదవండి :

Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ రాజీనామా చేయాలి.. రెజ్లర్లకు రైతు నేతల మద్దతు..

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

Updated Date - 2023-05-07T20:44:33+05:30 IST