Javed Akthar: లాహోర్‌లో పాక్‌ను ఇరుకున పెట్టిన జావెద్ అక్తర్

ABN , First Publish Date - 2023-02-21T17:12:15+05:30 IST

హిందీ సినిమా పాటల రచయిత, కవి జావెద్ అక్తర్ (Javed Akthar) తన మాటలతో పాకిస్థాన్‌కు షాకిచ్చారు.

Javed Akthar: లాహోర్‌లో పాక్‌ను ఇరుకున పెట్టిన జావెద్ అక్తర్
Javed Akhtar criticised Pakistan

లాహోర్: పాకిస్థాన్ (Pakistan) లాహోర్‌(Lahore)లో ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ సంస్మరణార్ధం నిర్వహించిన కార్యక్రమంలో హిందీ సినిమా పాటల రచయిత, కవి జావెద్ అక్తర్ (Javed Akthar) తన మాటలతో షాకిచ్చారు. 2008లో నవంబర్ 26న ముంబైపై (Mumbai Attack) పాక్ ఉగ్రవాదుల దాడి ఘటనను ఆయన ప్రస్తావించారు. ముంబైపై దాడి చేసిన వారు నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదన్నారు. ముంబైపై భయానక దాడి చేసిన వారు పాకిస్థాన్‌లో ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, భారతీయులకు ఈ విషయం సహజంగానే ఇబ్బందికరంగా ఉంటుందని అక్తర్ వ్యాఖ్యానించడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. పాకిస్థాన్ కళాకారులను భారత్ గొప్పగా స్వాగతిస్తుందని, అయితే భారత కళాకారులకు పాక్‌లో తగిన గౌరవమే లేదని అక్తర్ ఆరోపించారు. నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఫైజ్ సాబ్, మెహదీ హసన్ భారత్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన సందర్భాన్ని అక్తర్ గుర్తు చేశారు. లతా మంగేష్కర్‌ కోసం ఒక్కటైనా వేడుక నిర్వహించారా అని అక్తర్ నిలదీశారు.

Untitled-3.jpg

అక్తర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌ను పాకిస్థాన్‌లోనే ఎండగట్టడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. పాక్‌లో దూరి మరీ దెబ్బతీశారంటూ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) జావెద్ అక్తర్‌పై ప్రశంసలు కురిపించారు.

15.jpg

2008లో నవంబర్ 26న ముంబైపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 175 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 29 దేశాలకు చెందిన వారున్నారు. దాడికి పాల్పడ్డ 10 మంది ఉగ్రవాదుల్లో కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. తర్వాత విచారణ జరిపి ఉరితీశారు. లష్కర్ ఎ తొయిబా (Lashkar-e-Taiba) అనే ఉగ్రవాద సంస్థతో పాటు పాక్ ఆర్మీ కూడా ముంబైపై దాడి చేసిన ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు, నిధులు అందించాయి. దాడికి సూత్రధారులైన హఫిజ్ సయీద్, జకివుర్ రహమాన్ తదితరులు ఇప్పటికీ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీన్ని భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా కూడా నిలదీసింది. అయినా పాకిస్థాన్‌కు బుద్ధి రాలేదు.

9b57331c-b630-4daa-ae2c-0b1e04f1b60b.jpg

జావెద్ అక్తర్ వ్యాఖ్యలు పాక్‌కు పుండుపై కారం చల్లిన చందంగా మారాయి. సొంతగడ్డపై పాక్‌ను అక్తర్ నిందించడంపై పాక్ పాలకులు జీర్ణం చేసుకోలేకపోతుండగా భారత్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-02-21T17:18:44+05:30 IST