Karnataka Polls : స్వతంత్ర అభ్యర్థి డిపాజిట్ రూ.10 వేలు చెల్లించిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది!
ABN, First Publish Date - 2023-04-19T11:49:15+05:30
భారత దేశ ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ధనిక, పేద వర్గాల తారతమ్యం ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానులే.
బెంగళూరు : భారత దేశ ప్రజాస్వామ్యం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ధనిక, పేద వర్గాల తారతమ్యం ఏమీ లేదు. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని కర్ణాటక శాసన సభ (Karnataka Assembly) ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యంకప్ప (Yankappa) రుజువు చేశారు. ఈ రోజుల్లో అభ్యర్థులు డిపాజిట్ సొమ్మును సునాయాసంగా డిజిటల్ విధానంలో చెల్లించే అవకాశం ఉంది. కానీ యంకప్ప తాను చెల్లించవలసిన డిపాజిట్ రూ.10,000ను రూపాయి నాణేల రూపంలో చెల్లించారు. నామినేషన్ పత్రాలతోపాటు రూపాయి నాణేలతో కూడిన బస్తాను ఆయన తీసుకొచ్చేసరికి ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. వాటిని లెక్కపెట్టేసరికి వారికి తల ప్రాణం తోకకు వచ్చింది.
యంకప్ప మంగళవారం యాద్గిర్ (Yadgir) శాసన సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు రూపాయి నాణేలను ఎన్నికల అధికారుల బల్లపై పెట్టడంతో, వాటిని అధికారులు లెక్కపెట్టడానికి సుమారు రెండు గంటలు పట్టింది. నామినేషన్ దాఖలు చేయడం కోసం ఆయన తన మెడలో స్వామి వివేకానంద, 12వ శతాబ్దంనాటి సాంఘిక సంస్కర్త బసవేశ్వర, కర్ణాటకకు చెందిన సాధువు, కవి కనకదాస, బీఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ ప్రవేశిక చిత్రాలతో కూడిన బ్యానర్‌ను ధరించారు. ఈ చిత్రాల క్రింద కన్నడంలో ఓ హామీని రాశారు. ‘‘కేవలం ఓ రూపాయి మాత్రమే కాదు, ఒక రోజు నాకు ఓటు వేయండి, నేను మీకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాను’’ అని తెలిపారు.
యంకప్ప మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి, ప్రజల నుంచి విరాళాలను సేకరించానని చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే డిపాజిట్ చెల్లించినట్లు తెలిపారు. తన ఆస్తుల విలువ రూ.60,000 అని చెప్పారు. తన తండ్రి దేవీంద్రప్పకు దాదాపు ఎకరన్నర విస్తీర్ణంగల భూమి ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election: మాజీ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి జేడీ(ఎస్)లో చేరిక
EPS: ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయరా?
Updated Date - 2023-04-19T11:49:15+05:30 IST