Kumaraswamy: మాజీసీఎం సంచలన కామెంట్స్.. డీకే శివకుమార్ సీఎం అయితే మద్దతిస్తాం..
ABN , First Publish Date - 2023-11-05T13:10:41+05:30 IST
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ మద్దతునిస్తుందని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి
- ఎన్‌డీఏ నుంచి బయటకొస్తే చర్చిద్దాం: డీకే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ మద్దతునిస్తుందని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి(Kumaraswamy) ప్రకటించారు. శనివారం జేడీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు డీకే శివకుమార్ సీఎం అయితే జేడీఎస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలోనే రాష్ట్రంలో టీసీఎం, డీసీఎం పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. టెంపరరీ చీఫ్ మినిస్టర్ (టీసీఎం), డూప్లికేట్ చీఫ్ మినిస్టర్ (డీసీఎం) అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2018లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ సారథిగా కుమారస్వామి వ్యవహరించారు. ఏడాదిన్నర తర్వాత కాంగ్రె్‌సకు చెందిన 14 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురితో కలిపి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సర్కారు పతనమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూలేందుకు అప్పటి సమన్వయకర్తగా వ్యవహరించిన సిద్దరామయ్య కారకుడని పలుమార్లు కుమారస్వామి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయేందుకు కారకులైన సిద్దరామయ్యను దెబ్బతీయవచ్చుననే కుమారస్వామి వ్యాఖ్యలు ఉన్నాయనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్‌డీఏ నుంచి బయటకొస్తే చర్చిద్దాం: డీకే శివకుమార్
కుమారస్వామి ఎన్‌డీఏ కూటమిలో ఉన్నారని, బయటకి వస్తే చర్చిద్దామని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. కుమారస్వామి వ్యాఖ్యల తర్వాత బెంగళూరు కుమారకృప వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ఎన్‌డీఏ కూటమిలో ఉన్నారని, వారు తమకు వ్యతిరేకమన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలు సంతోషం కలిగించాయన్నారు. ప్రస్తుతం తమకు 136 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. సహకారం ఇవ్వాల్సిన వేళ కాకుండా ప్రస్తుతం మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ ఒకసారి కుమారస్వామిని సీఎం చేశాయని, దేవెగౌడను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చేసిందని గుర్తు చేశారు. అపార అనుభవం కలిగిన కుమారస్వామి ప్రతిపక్షంలో ఉంటూ నిత్యం విమర్శలు కాకుండా ప్రభుత్వానికి మార్గదర్శకం చేయాలని, ఆయన అభిమానానికి నమస్కారం అన్నారు.