Mamata Banerjee : ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ఈద్ సందర్భంగా మమత బెనర్జీ..
ABN, First Publish Date - 2023-04-22T11:41:12+05:30
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee) శనివారం బీజేపీ (BJP), ఏఐఎంఐఎం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (West Bengal chief minister Mamata Banerjee) శనివారం బీజేపీ (BJP), ఏఐఎంఐఎం (AIMIM) పార్టీలపై పరోక్ష విమర్శలు చేశారు. తాను దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమేనని, దేశాన్ని విభజించడానికి మాత్రం అనుమతించేది లేదని చెప్పారు. ఆమె కోల్‌కతాలో ఈద్ ఉల్ ఫితర్ (Eid-ul-Fitr) ప్రార్థనలు చేస్తున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు.
మమత ప్రత్యక్షంగా ఎవరి పేరును ప్రస్తావించకుండా మాట్లాడారు. తాను తన రాజకీయ ప్రత్యర్థుల ధనబలంపై పోరాడటంతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా పోరాడవలసి వస్తోందని చెప్పారు. ‘‘బెంగాల్‌లో శాంతి కావాలి. అల్లర్లు వద్దు. దేశంలో విభజనలు వద్దు. కొందరు దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నారు, విద్వేష రాజకీయాలు చేస్తున్నారు. నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దేశంలో ఎలాంటి విభజనలను అనుమతించను’’ అని చెప్పారు.
తన రాజకీయ ప్రత్యర్ధుల ధన బలంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని మమత తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే టీఎంసీపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారన్నారు. అయినప్పటికీ తాను తల వంచేది లేదన్నారు.
‘‘బీజేపీ నుంచి డబ్బు తీసుకుని, ముస్లిం ఓట్లను చీల్చుతామని ఒకరు అంటున్నారు. బీజేపీ కోసం ముస్లిం ఓట్లను చీల్చే దమ్ము వాళ్లకు లేదని నేను చెప్తున్నాను’’ అని తెలిపారు. దేశంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే ఎన్నికలు ఓ ఏడాదిలో రాబోతున్నాయన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతామని మనం శపథం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ విభజన శక్తులను గద్దె దించాలన్నారు. మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే, అంతా నాశనమేనని హెచ్చరించారు.
ఏఐఎంఐఎంను బీజేపీకి బీ-టీమ్ అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
మీ నిర్ణయం బాగుంది.. అండగా ఉంటా!
Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు
Updated Date - 2023-04-22T11:41:12+05:30 IST