Maratha Reservation row: షిండే శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ రాజీనామా
ABN , First Publish Date - 2023-10-29T20:07:36+05:30 IST
మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం ఎంపీ హేమంత్ పాటిల్ అదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు చెప్పారు.

ముంబై: మరాఠా కమ్యూనిటీకి (Maratha community) రిజర్వేషన్ (Reservation) కల్పించాలనే డిమాండ్‌కు మద్దతుగా ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం ఎంపీ హేమంత్ పాటిల్ (Hemant Patil) అదివారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా (Resign) చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హింగోలి (Hingoli) లోక్‌సభ నియోజకవర్గానికి హేమంత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మఠాఠా కమ్యూనిటీకి విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌పై పోఫలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో నిరసన తెలుపుతున్న మారాఠా యాక్టివిస్ట్‌లను హేమంత్ పాటిల్ ఆదివారంనాడు వారిని కలుసుకున్నారు. వారి ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. అక్కడికక్కడే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను అడ్రెస్ చేస్తూ లేఖ రాశారు.
లేఖలో ఏం రాశారు?
మరాఠా రిజర్వేషన్ అంశం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని, రిజర్వేషన్ అంశంపై మరాఠా సమాజంలో భావోద్వేగాలు నెలకొన్నాయని హేమంత్ పాటిల్ తన లేఖలో తెలిపారు. తాను మరాఠా కమ్యూనిటీకి, రైతులకు అంకితమైన కార్యకర్తనని, రిజర్వేషన్ అంశంపై తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
కాగా, ఓబీసీ కేటగిరి కింద విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మరాఠా కమ్యూనిటీ కొద్దికాలంగా నిరసనలు, ప్రదర్శనలు చేస్తోంది. కోటా యాక్టివిస్ట్ మనోజ్ జారంగే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తూ, రెండో విడత నిరవధిక నిరాహార దీక్షను అక్టోబర్ 25న ప్రారంభించడంతో మరాఠా ఉద్యమ ఆందోళన ఊపందుకోనుంది. జారంగే పిలుపుపై పలు గ్రామాల ప్రజలు రాజకీయ నాయకులను తమ గ్రామాల్లోకి అడుగుపెట్టనీయకుండా నిషేధించారు. మరాఠా కమ్యూనిటీ పెండింగ్ డిమాండ్లపై చర్యలు తీసుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆదివారం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో నిరవధిక నిరాహార దీక్షలు మొదలవుతాయని జారంగే ప్రకటించారు. లీగల్ స్క్రూటినీకి లోబడి మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.