Mumbai fire: ముంబై లోక్‌మాన్య తిలక్ టెర్మినస్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా ప్రయాణికుల తరలింపు
ABN , First Publish Date - 2023-12-13T17:04:03+05:30 IST
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్స్ వైపు పాకడంపై అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది.

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (LTT)లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. మంటలు బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్స్ వైపు పాకడంపై అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడటం కానీ, మరణించడం కానీ జరుగలేదని అధికారులు తెలిపారు.
ఫ్లాట్‌ఫాం నెంబర్ 1 వద్ద చెలరేగిన మంటలు
సెంట్రల్ రైల్వే వివరాల ప్రకారం, ఎల్‌టీటీ స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం నెంబర్-1 వద్ద ఉన్న జన్ ఆధార్ క్యాంటీన్‌లో ఈ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంటలు పైకప్పు వరకూ ఎగబాకాయి. 2.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి డాక్టర్ శివరాజ్ ధ్రువీకరించారు. 3.30 గంటల కల్లా మంటలను అదుపు చేసినట్టు వివరించారు.